
మొన్నటికి మొన్న కరోనా వైరస్ ఎంతోమందిపై పంజా విసిరి ప్రాణాలు తీస్తే.. ఇక ఇప్పుడు సడన్ హార్ట్ ఎటాక్ లు చూస్తూ చూస్తుండగానే ప్రాణాలు తీసేస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు.. ఆరోగ్యంగా ఉన్న వారి దగ్గర నుంచి వ్యాధులతో బాధపడుతున్న వారి వరకు అందరూ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వెరసి ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణ తీపిని పెంచేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది. ఆ చిన్నారి ఇంకా ఈ లోకాన్ని కూడా సరిగ్గా చూడలేదు. అంతలోనే కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు.
పిల్లలతో ఆడుకుంటూ మూడు సంవత్సరాల బాబు అకస్మాత్తుగా మరణించిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది. కాకరవాయి గ్రామానికి చెందిన గౌరబోయిన శంకర్, కవిత దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. అయితే మూడేళ్ల కుమారుడు జై ఇంటి సమీపంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇక చూస్తూ చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాగా అతని ముక్కులో నుంచి నలుపు రంగు నీరు రావడం గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాబు గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.