సాధార‌ణంగా ఏ తల్లిదండ్రులైనా పిల్లలను బుద్దిగా పెంచాలనుకుంటారు. పిల్ల‌లు త‌మ‌లా క‌ష్టాల పాలు కాకుండా ఉన్న‌త‌స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటారు. త‌మ పిల్ల‌లు ఉన్న‌త స్థానంలో ఉంటే ఆ త‌ల్లిదండ్రుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా ఉంటుంది. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఈ దంప‌తులు వ్య‌వ‌హ‌రిస్తూ.. చోరీల‌లో క‌న్న కూతురుని కూడ భాగం చేస్తున్నారు.

వీరు ప‌లుమార్లు జైలుకు వెళ్లి వ‌చ్చినా వీరి తీరు మాత్రం మార‌డము లేదు. తాజాగా ఈ ముగ్గురినీ కామాటిపుర పోలీసులు అరెస్ట్ చేసారు. అదేవిధంగా వీరి వ‌ద్ద నుంచి 16.5 తులాల బంగారు న‌గ‌లు స్వాధీనం చేసుకున్న‌ట్టు ద‌క్షిణ మండ‌లం డీసీపీ డాక్ట‌ర్ గ‌జారావు భూపాల్ వెల్ల‌డించారు. వివ‌రాల్లోకి వెళ్లితే.. హైద‌రాబాద్ న‌గ‌రంలోని  మైలార్‌దేవ్ ప‌ల్లి మొగ‌ల్ కాల‌నీకి చెందిన అబ్దుల్ స‌లీమ్ పాత దుస్తుల వ్యాప‌రం చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తుంటాడు. ఇత‌ని భార్య జ‌కియా బేగం(43), కూమార్తె అయేషా సిద్ధిఖీ(19) ఇంట్లోనే ఉంటున్నారు. ఏ ప‌ని చేసినా క‌ష్ట‌ప‌డాల‌ని భావించి అడ్డ‌దారిలో సుల‌భంగా డ‌బ్బు సంపాదించేందుకు చోరీలు చేయ‌డ‌మే వీరి వృత్తిగా ఎంచుకున్నారు.

ఎవ‌రికీ అనుమానం రాకుండా చ‌క్క‌గా ముస్తాబ్ అయి బ‌య‌టికి వెళ్తుంటారు. ముఖ్యంగా కూతురు సిద్ధిఖీ  చోరీ చేసేందుకు అనువైన ఇండ్ల‌ను గుర్తించి ముందుగా రెక్కీ నిర్వ‌హించి వ‌స్తుంది. ఆ త‌రువాత తండ్రి  స‌లీమ్ ఆరుబ‌య‌ట ఉంటూ ప‌రిస‌రాలు గ‌మ‌నిస్తూ ఉంటాడు. స‌లీమ్ భార్య జ‌కియాబేగం ఇంట్లోకి దూరి విలువైన వ‌స్తువులు కాజేసుకు వ‌స్తుంటుంది. ఈ ముగ్గురు క‌లిసి 2019 నుంచి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో దొంగ‌త‌నాలు చేసారు. అనుమానం వ‌చ్చి ఎవ‌రైనా నిల‌దీస్తే అద్దె ఇంటికోసం వెతుకుతున్నాం అని, తుల‌పులు తీసి ఉండ‌డంతో లోప‌లికి వ‌చ్చాం అని స‌మాధానం చెప్పి తెలివిగా త‌ప్పించుకుంటారు.

వీరు చోరీ సొత్తును నగల వ్యాపారుల వద్ద తనఖా ఉంచటం, లేదా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరు  విమానాల్లో తిరుగుతూ జల్సా  కూడా చేసే వారు.  ఇటీవల చందూలాల్‌ బారాదరి, గుల్షన్‌నగర్‌, ఘాజిబండ తదితర ప్రాంతాల్లో వరుసగా నాలుగు చోరీలు  చోటు చేసుకున్నాయి. అయితే కామాటిపుర ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, డీఐ శ్రీనివాస్‌ దర్యాప్తు  మొద‌లుపెట్టారు.  సీసీ కెమెరాలను పరిశీలించి చూడ‌గా ఈ నిందితులను గుర్తించారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, డీఐ శ్రీనివాస్‌, డీఎస్‌ఐ డానియేల్‌, కానిస్టేబుళ్లు అబ్దుల్‌ జలీల్‌, కె.నవీన్‌ల‌ను అభినందించారు డీసీపీ డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: