ఏపీ ఎన్నికల్లో పిఠాపురం సీట్ హాట్ టాపిక్ గా మారింది. జనసేనాని ఇక్కడి నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే పవన్ ను మరోసారి ఓడించి ఆయన్ను దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహం. అందుకే అక్కడ స్థానిక అభ్యర్థి వంగా గీతను పోటీలో నిలబెట్టారు.


వంగా గీత ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థిగా 2009లో గెలిచారు. పవన్-గీత ఒకే సామాజిక వర్గం కావడంతో ఇక్కడి వార్ మరింత ఉత్కంఠ పెంచుతోంది.  పిఠాపురంతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన మూడు రోజుల పాటు అక్కడే ఉంటూ పార్టీ వ్యూహాలపై చర్చించారు. బాధ్యతలన్నీ టీడీపీ ఇన్ ఛార్జి వర్మకు అప్పజెప్పారు.  ఈ మేరకు వర్మ కూడా పవన్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తున్నారు.


ఇదిలా ఉండగా పవన్ పిఠాపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక ఆయనకు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జబర్దస్త్ నుంచి కొందరు, సినీ ఇండస్ట్రీ నుంచి మరికొందరు ఇలా పవన్ అభిమానులు ఆయన గెలపును కాంక్షిస్తూ గ్రామాల్లో తిరుగుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఇలా వీరు వచ్చేది ఎవరికీ తెలియడం లేదు.


పిఠాపురం ప్రచార బాధ్యతలన్నీ వర్మ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నారు. కానీ జనసేన నేతలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో.. ఎంత మంది వస్తున్నారో ఏయే మండలాలకు వెళ్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో స్థానిక జనసేన నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ధర్నాలు చేపడుతున్నారు. ఇలా అయితే తాము పవన్ కి వ్యతిరేకంగా పని చేస్తామని చెబుతున్నారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరీ ప్రచారం చేస్తున్నా తమకు విలువ లేదని వాపోతున్నారు. అయితే సమన్వయం విషయంలో పవన్ ఆర్ఎస్ఎస్ సూచనలు తీసుకుంటే బాగుంటుంది అని పలువురు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: