వైసీపీ ప్లీనరీ సందర్భంగా సీఎం జగన్‌ ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అందులో తాను 95 శాతం హామీలు అమలు చేశానని.. కానీ ఐదు హామీలు మాత్రం అమలు చేయలేకపోయానని అంగీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీపీఎస్ రద్దు చేయలేకపోయామని ఒప్పుకున్నారు. అలాగే ప్రత్యేక హోదా సాధించలేకపోయామని వైసీపీ ప్లీనరి సాక్షిగా సీఎం జగన్ అంగీకరించినట్టయింది. మొత్తం హామీల్లో 95శాతం నెరవేర్చామంటూ వైసీపీ ప్రత్యేక బుక్ లెట్లను ముద్రించి పంచింది.


తాము ఎన్నికల్లో ఇచ్చిన 129 హామీల్లో కేవలం 6 మాత్రమే అమలు చేయలేదని ఆ బుక్‌ లెట్లలో పేర్కొంది. వైసీపీ ప్లీనరీకి వచ్చిన వారికి ఈ బుక్‌లెట్లు అందజేశారు. మూడేళ్ల పాలనలో చేసిన పనులను వివరించే బుక్ లెట్లు.. రాష్ట్ర ప్రజలకు సీఎం రాసిన బహిరంగ లేఖను కూడా ప్లీనరీలో పంపిణి చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు.. వాటి అమలు తీరుని వివరిస్తూ 6 పేజీలతో ఓ పాంప్లేట్ రూపొందించారు. వైసీపీ మొత్తం 129 హామీలివ్వగా అందులో 123 అమలు చేశామని అందులో రాసుకొచ్చారు.


ఇంకా కేవలం 6 హామీలే అమలు చేయాల్సి ఉందని వాటిలో తెలిపారు. అయితే ఎన్నికలకు ముందు హామీ ఇవ్వని 45 పనులు అదనంగా చేశామని తెలిపారు. కానీ.. ప్రత్యేక హోదా సాధన, ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామన్న హామీలు అమలు చేయలేకపోయామని ఆ పాంప్లెట్‌ లో తెలిపారు. అలాగే.. ఎస్సీ, ఎస్టీ యువతుల వివాహానికి పెళ్లి కానుకగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇవ్వలేకపోయామన్నారు. దీంతో పాటు బీసీ యువతుల వివాహాలకు 50వేల రూపాయల సాయం ఇవ్వలేకపోయామని తెలిపారు.


వీటితో పాటు ముస్లిం మైనార్టీలకు వైసీపీ కానుకగా లక్ష రూపాయలు ఇవ్వలేకపోయామని..  క్రైస్తవ మైనార్టీల వివాహానికి వైఎస్సార్ కానుకగా లక్ష రూపాయలు ఇస్తామన్న హామీలు కూడా  నెరవేర్చలేకపోయామని వైసీపీ తన పాంప్లేట్‌లో తెలిపింది. ఏదేమైనా ఏం చేశాం.. ఏం చేయలేదు.. అన్న విషయాలతో క్లారిటీగా కరపత్రాలు వేయించడం మాత్రం మెచ్చుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: