కరోనా కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రపంచ దేశాలకు ఈ వైరస్ మహమ్మారి కలిగిస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. అన్ని రంగాలు ఇప్పటికే కుదేలయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. దీని నుంచి ఎప్పుడు కోలుకుని బయటపడతామో తెలియని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ కారణంగా జనజీవనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు . అయితే వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది మరికొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇలా అంతా తమ ప్రాణాలకు తెగించి కార్యకలాపాలు సాగిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ వీరి సేవలను ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వాలు వీరికి అదనంగా పారితోషకం చెల్లిస్తూ, వారి సేవలకు తగిన గుర్తింపు ఇస్తున్నాయి. అయితే ఇక్కడే ఎవరికీ కనిపించని, ఎవరూ గుర్తించని వ్యక్తులు కూడా తమ ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం లో భాగస్వాములు అవుతున్నారు.

 

IHG


అయినా వారికి గుర్తింపు లేకపోగా, అరకొర జీతాలు, అవమానాలే మిగులుతున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా కూడా ఇప్పుడు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పత్రికలు, ఛానళ్లు నడవడమే కష్టంగా మారింది. లాక్ డౌన్ విధించినా, కర్ఫ్యూ పెట్టినా, రిపోర్టర్లు, మీడియా సిబ్బంది మాత్రం పని చేయక తప్పని పరిస్థితి. పండగ, పబ్బం అనే తేడా లేకుండా ఫీల్డులో తిరగాల్సిందే. అసలు ఇంటి నుంచి బయటకు ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. ఎండకు కరోనా ఎండుతూ, వానకు తడుస్తూ బతికేస్తుంటారు. ఇంత కష్టపడుతున్నా, కనీసం వారికి ఉద్యోగ భద్రత కూడా లేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. 

 

IHG

 

ఇక యాజమాన్యాలు ఇచ్చే అరకొర జీతాలు సరిపోక ఇబ్బంది పడేవారు కొందరైతే, మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించే వారు ఈ రంగంలో లేకపోలేదు. అయితే నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు గా ఇప్పుడు మీడియా జీవులపై కరోనా  పిడుగు పడింది. ఇప్పటికీ కొంత మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. తమిళనాడులోని ఓ న్యూస్ ఛానల్ కు చెందిన 27 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇదంతా ఫీల్డ్ రిపోర్టర్లు డెస్క్ కు రావడంతోనే ఇదంతా జరిగినట్లుగా తేలింది. అలాగే ముంబైలో 53 మంది జర్నలిస్టులకు ఈ మహమ్మారి సోకింది. 

 

IHG


అంతెందుకు తెలంగాణలోనూ దీని ప్రభావానికి గురైన వారు చాలా మంది ఉన్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఒక్కసారిగా మీడియా మీద ఆధారపడి బతుకుతున్న వారందరిలోనూ ఒకటే అలజడి చెలరేగింది. మనల్ని మనమే కాపాడుకోవాలి... మనల్ని ఆదుకునేవారు ఎవరూ లేరు అంటూ జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపు ల్లో మెసేజ్ లు పెట్టుకుని ఓదార్పులు చేసొవాల్సిన పరిస్థితి వచ్చిపడింది. అయినా రిస్కు చేసి ఫీల్డ్ లో తిరుగుతున్న వారికి అవమానాలు, ఇబ్బందులు తప్పడం లేదు. 

 

రోజూ విధి నిర్వహణ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తుంటే చుట్టుపక్కల వారు అభ్యంతరం చెప్పడం, కొంత మంది ఇంటి యజమానులు గేటుకు తాళాలు వేసి మరి వేధిస్తున్నారని జర్నలిస్టులు వాపోతున్నారు. ప్రస్తుతం మీడియా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి మరి ఫీల్డ్ లో తిరుగుతున్నా, తగిన గుర్తింపు గాని, ఆదరణ కానీ లేకపోవడం నిజంగా తీరని ఆవేదన కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: