అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి తీరు ఒకలాగే ఉంటుందేమో అని అనిపిస్తోంది. లేకపోతే 151 సీట్ల బంపర్ మెజారిటితో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసిపికి తెలుగుదేశంపార్టీ నేతల అవసరం ఏముంటుంది ? నిజానికి టిడిపి నుండి నేతలను చేర్చుకోవటం వల్ల వైసిపికి నష్టమే తప్ప లాభం లేదనేది వాస్తవం. అయినా చేరికలకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకింత సానుకూలంగా ఉన్నాడో అర్ధం కావటం లేదు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో గొడవలు పెరిగిపోతున్నాయి. గొడవలు జరుగుతున్న నియోజకవర్గాలను చూస్తూ కూడా జగన్ చేరికలపై ఆసక్తి చూపుతున్నాడంటే చంద్రబాబునాయుడు చేసిన తప్పునే చేస్తున్నట్లు లెక్క. శుక్రవారం వైజాగ్ లోని టిడిపి మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ వైసిపి కండువా కప్పుకున్నాడు. ఇది వరకే గన్నవరం, చీరాల, గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏలు కరణం బలరామ్, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి టిడిపికి దూరం జరిగి వైసిపికి దగ్గరయ్యారు. వీళ్ళ ముగ్గురు అధికారికంగా వైసిపిలో చేరకపోయినా జగన్ కు మాత్రం పూర్తి మద్దతుగానే నిలబడుతున్నారు.
నిజానికి అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు+3 ఎంపిలను టిడిపిలోకి లాక్కున్నాడు. ఇలా తెచ్చుకున్న వాళ్ళల్లో నలుగురికి మంత్రిపదవులు కూడా ఇచ్చాడు. సరే వాళ్ళు పార్టీ ఫిరాయించే విషయంలో ఎటువంటి ప్రలోభాలకు గురయ్యారు ? చంద్రబాబు ఎంతవరకు హామీని నిలబెట్టుకున్నాడన్నది వేరే సంగతి. వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళ పరిస్ధితి ఎలా తయారైందన్నదే ఇంపార్టెంట్. ఒరిజినల్ టిడిపి నేతలకు ఫిరాయింపు నేతలకు ఒక్క నిముషం కూడా పడలేదు. ఏ విషయంలోను ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వీళ్ళ మధ్య సయోధ్య చేద్దామని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఫలితంగా పార్టీలోనే అంతర్ యుద్ధం మొదలై ఇద్దరు నేతల వర్గాల మధ్య వివాదాలు బాగా పెరిగిపోయాయి. ఫలితంగా దాన్ని ప్రభావం మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా కనబడ్డాయి.
23 మంది ఫిరాయింపు ఎంఎల్ఏల్లో చంద్రబాబు 17 మందికి టిక్కెట్లిచ్చాడు. అయితే అందులో గెలిచింది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవి కుమార్ మాత్రమే. మిగిలిన 16 మంది చిత్తుగా ఓడిపోయారు. అంటే ఇటు జనాలూ వాళ్ళకు ఓట్లేయలేదు. అటు పార్టీ నేతలు, క్యాడర్ కూడా వాళ్ళ గెలుపుకు సహకరించలేదని అర్ధమైయిపోంది. పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహించిన చంద్రబాబు మాత్రం గబ్బుపట్టిపోయాడు. టిడిపి హయాంలో జరిగిన ఫిరాయింపుల ఘటన ఇపుడు జగన్ కు ఓ గుణపాఠంగా నిలవాలి. కానీ జగన్ ఏమి చేస్తున్నాడు ? దాదాపు చంద్రబాబు పంథాలోనే పోతున్నాడు. వల్లభనేని, మద్దాలి, కరణం తో జగన్ కు ఏమి అవసరమని వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తున్నాడు?
ఎన్నికలకు ముందు చీరాల టిడిపి ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ వైసిపిలో చేరాడు. అప్పట్లోనే ఆమంచి రాకను పార్టీ నేతలు గట్టిగా వ్యతిరేకించారు. అయినా ఉపయోగం లేకపోయింది. చివరకు చీరాలలో వైసిపి తరపున పోటి చేసిన ఆమంచి చిత్తుగా ఓడిపోయాడు. అసలు ఇక్కడ ఆమంచి కాకుండా పార్టీ నేతల్లో ఎవరు పోటి చేసినా కచ్చితంగా గెలిచేవారే అని వైసిపి నేతలంటున్నారు. సరే ఎన్నికల తర్వాత టిడిపి ఎంఎల్ఏ కరణం వైసిపికి సానుకూలంగా ఉన్న కారణంగా స్ధానిక వైసిపి నేతలతో ఆయనకు పడటం లేదు. అలాగే గన్నవరంలో వల్లభనేని కారణంగా వైసిపి నేతలతో గొడవలవుతున్నాయి. గుంటూరు వెస్టులో గిరి అంతగా యాక్టివ్ కానందు వల్ల ఇంకా పార్టీలో గొడవలు బయటపడలేదు. ఇపుడు వైజాగ్ లో టిడిపి మాజీ ఎంఎల్ఏ పంచకర్ల రమేష్ వైసిపిలో చేరాడు. మాజీమంత్రి గంటా విషయం అందరికీ తెలిసిందే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే టిడిపి నేతలను వైసిపిలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్ కు ఎంతమాత్రం లేదు. వాళ్ళు అంతగా టిడిపిలో ఉండలేకపోతే ఏమి చేయాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి. అంతేకానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారంటేనే జనాలు రెజెక్టు చేసినట్లు లెక్క. అలాంటి నేతలను జగన్ పార్టీలో చేర్చుకుంటున్నాడంటే జనాలకు ఎటువంటి మెసేజ్ పంపుతున్నట్లు ? టిడిపిలో పాత-కొత్త నేతల మధ్య గొడవలు జరిగినట్లే తన పార్టీలో కూడా జరగాలని కోరుకుంటున్నాడా జగన్ ? టిడిపిలో జరిగిన గొడవలను చూసి కూడా జగన్ ఏమి గుణపాఠం నేర్చుకున్నట్లు ? ఇలా చేర్చుకుంటూ పోతే చివరకు అసలుకే మోసం రావటం ఖాయమని గ్రహించకపోతే కష్టమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి