ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డికి హీరో వర్షిప్ వచ్చిందన్నది వాస్తవం. అయితే ఈ హీరో వర్షిప్ జగన్ కు అయాచితంగా వచ్చిందేమీ కాదు. బలవంతులతోను, వ్యవస్ధలతోను ఢీ కొన్న తర్వాతే వచ్చిందన్నది గుర్తుంచుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఉన్నంత వరకు జగన్ కు జనాలతో పనిపడలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్ పబ్లిక్ లోకి వచ్చిన దాఖలాలు చాలా తక్కువే. ఎప్పుడైతే వైఎస్సార్ మరణించారో అప్పుడే జగన్ మొదటిసారి పూర్తిగా జనాల్లోకి వచ్చారు. ఓదార్పు యాత్ర చేయాలని వైఎస్ కుటుంబం నిర్ణయించింది. వైఎస్సార్ మరణం కారణంగా చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించాలన్నది వైఎస్ కుటుంబం ఆలోచన. కానీ అందుకు కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నేతలు అంగీకరించలేదు. వైఎస్ అంటే అప్పటికే మండిపోతున్న సీనియర్లలో కొందరు జగన్ కూడా తమకు ఎక్కడ సమస్యగా మారుతాడో అన్న అనుమానంతో అడ్డుకున్నారు. తమ ఆలోచనను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధితో చెప్పి జగన్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.




దాంతో తన నిర్ణయాన్ని మార్చుకునేందుకు అంగీకరించని జగన్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధి ని ధిక్కరించి పార్టీలో నుండి బయటకు వచ్చేశారు.  కాంగ్రెస్ పార్టీలో నుండి బయటకు వచ్చేసిన జగన్ వెంటనే వైఎస్సార్సీపీని ఏర్పాటు చేశారు. సోనియా గాంధిని ఎదిరించేనాటికి దేశంలో  ఆమె కత్తికి ఎదురేలేదన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి సోనియాను జగన్ ఎదిరించటమంటే మామూలు విషయం కాదు. సోనియాను ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి జగనే కావటంతో జనాల్లో సోనియా అంటే పడని వాళ్ళకు జగన్ లో హీరో కనిపించాడు. వ్యవస్ధలను, బలవంతులను ఎదిరించి నిలిచిన వాళ్ళవైపే జనాలందరూ ఆరాధనగా  చూస్తురన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో హారీ ఇమేజి ఎలా పెరుగుతుందో నిజజీవితంలో జగన్ కు కూడా అలాంటి హీరో వర్షిప్పే మొదటిసారి జనాల్లో కలిగింది.




సోనియాను ఎదరించి జగన్ పార్టీ పెట్టిన తర్వాత మొదలైన వేధింపులతో జనాల్లో జగన్ అంటే హీరో వర్షిప్ కు తోడు సానుభూతి కూడా పెరిగిపోయింది. తండ్రి చనిపోయిన కుర్రాడిని పట్టుకుని కాంగ్రెస్ వేధిస్తోందనే విషయం జనాల్లో బాగా ఇంకిపోయింది. ఇక రెండో అంశం చూస్తే బలవంతుడైన చంద్రబాబునాయుడును ఎదిరించటం. చంద్రబాబు కుట్రలను, ఎల్లోమీడియా రాతలను తట్టుకుని జగన్ నిలబడటాన్ని జనాలంతా హర్షించారు.  అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఇటు చంద్రబాబును  అటు ఎల్లోమీడియాతో ఒకేసారి ఫైట్ చేస్తుండటాన్ని జనాలంతా ఆసక్తిగా చూస్తున్నారు. చాలాసార్లు జగన్ దే చంద్రబాబుపైన పైచేయి కావటాన్ని జనాలంతా గమనించారు.




ఇటువంటి సమయంలోనే మూడో అంశంపై జనాల్లో అమాంతం జగన్ అంటే క్రేజ్ పెరిగిపోయింది. అదేమిటంటే న్యాయవ్యవస్ధనే ఢీకొనే ప్రయత్నం చేయటం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు ప్రయోజనాలను రక్షించటమే లక్ష్యంగా కొందరు న్యాయమూర్తులు పనిచేస్తున్నారంటు జగన్ చేసిన  ఫిర్యాదు దేశంలో సంచలనం సృష్టించింది. ఆ ఫిర్యాదుపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఏ విధంగా స్పందిస్తారో తెలీదు. అయితే జగన్ ఫిర్యాదుకు దేశవ్యాప్తంగా మద్దతుగా పెరుగుతోందన్నది మాత్రం నిజం. న్యాయవ్యవస్ధ ఎంతటి బలమైనదో అందరికీ తెలిసిందే. ఇటువంటి వ్యవస్ధతోనే  జగన్ పోరాటం చేసేందుకు రెడీ అయిన తీరును జనాలు మద్దతుగా నిలబడ్డారు. వ్యవస్ధల మీద తిరుగుబాటు చేసేవాళ్ళనే జనాలు హీరోలుగా చూస్తారు కానీ వ్యవస్ధలను మ్యానేజ్ చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్ళని కాదు.  మొత్తానికి ఈ మూడు అంశాల వల్లే జగన్ కు హీరో వర్షిప్ వచ్చిందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: