ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా.. విద్వేషాలు రెచ్చగొట్టేలా.. ఓ ప్రణాళిక ప్రకారం రఘురామ మాట్లాడారన్నది ప్రధాన అభియోగం. ఈ నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణరాజు పై సిఐడి పెట్టిన కేసులో మీడియా సంస్థలను కూడా నిందితులుగా చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏ వన్ గా రఘురామకృష్ణంరాజు ఉంటే.. ఏ2గా టీవీ5, ఏ 3 గా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఉండటం విశేషం.. ఇలా ఛానళ్లను ఏ2, ఏ3 లుగా పేర్కొనడం బహుశా ఇదే మొదటి సారి అయిఉంటుంది.

ఈ రెండు ఛానళ్లు రఘురామ కృష్ణంరాజుకు రోజూ ఒక స్లాట్ కేటాయించి ప్రభుత్వంపైన.. జగన్ వంటి  కొందరు ప్రముఖులపైన అసత్యాలు ప్రచారం చేశారన్నది సీఐడీ చెబుతున్న మాట. అలాగే ఈ రెండు ఛానళ్లు విద్వేషాలు వెదజల్లేలా యత్నించాయని సిఐడి ఆరోపిస్తోంది. సరే.. ఈ కేసులో ఇప్పటి వరకూ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశారు. ఓకే.. మరి ఈ ఏ2, ఏ3 ల సంగతేంటన్నది ఆసక్తికరంగా మారింది.

రఘురామ కృష్ణంరాజును చేసినట్టే ఈ టివి 5, ఎబిఎన్ చానళ్లవారిని కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ మీడియా సర్కిళ్లో జోరుగా జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ఈ ఛానళ్ల తరపున ఎవరిని అరెస్టు చేస్తారన్నది కూడా చర్చనీయాంశమే. ఇప్పటికే టీవీ5 జర్నలిస్టు మూర్తిని కొన్నాళ్ల క్రితం ఇలాగే పోలీసులు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఎవరిపై చర్య తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది.  

టీవీ5 ఛానల్ అధిపతి బీఆర్ నాయుడు కాగా.. ఏబీఎన్ అధిపతి వేమూరి రాధాకృష్ణ. మరి మీడియా సంస్థల అధిపతులను అరెస్టు చేస్తారా.. లేదా ఈ డిబేట్లు నిర్వహించిన సాంబశిరావు, మూర్తి, వెంకటకృష్ణ వంటి వారిని అరెస్టు చేస్తారా అన్నది చూడాలి. శనివారం సాయంత్రానికే ఈ ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేయొచ్చంటూ మీడియా సర్కిళ్లో జోరుగా ప్రచారం జరిగినా.. అలాంటిదేమీ జరగలేదు. మరి రఘురామ ఒక్కడితోనే అరెస్టు ఆపేస్తారా.. ఇంకా ముందుకెళ్తారా అన్నది చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: