హైదరాబాద్‌.. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.. అంతర్జాతీయ కంపెనీలన్నీ హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నాయి. హైదరాబాద్ ఐటీ కేపిటల్ గా అవతరిస్తోంది. మెట్రోపాలిటన్ సంస్కృతి పెరుగుతోంది. టెక్నాలజీ హబ్‌గా మారుతోంది. ఇవన్నీ ఓవైపు. మరోవైపు.. హైదరాబాద్ విదేశీ అక్రమ శక్తుల అడ్డాగానూ మారుతోంది. సైబర్‌ నేరస్థులు, మోసగాళ్లు, అసాంఘిక శక్తులు.. విదేశీ గూఢచారులకు కేరాఫ్‌గా మారుతుందన్న విమర్శలు వస్తున్నాయి.



ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారు.. ఇక్కడ దర్జాగా బ్రోకర్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. వాటి ఆధారంగా ఓటరు గుర్తింపు, ఆధార్‌ కార్డులు కూడా తేలిగ్గా పొందుతున్నారు. గతంలో అక్రమంగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చి నగరంలో మకాం వేసిన చాలా మందికి బ్రోకర్లు ధ్రువీకరణ పత్రాలు ఇప్పించారు. ఈ ముఠాపై సాగిన దర్యాప్తులో కొందరిని అరెస్టు చేశారు కూడా.



ఆ తర్వాత 2014లో హనీట్రాప్‌ ద్వారా పాకిస్థాన్‌కు భద్రతా రహస్యాలు అందజేస్తున్న నాయక్‌ సుబేదార్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు కూడా. వీరే కాదు.. దేశంలో ఉగ్రదాడులకు పాల్పడిన కీలక సూత్రదారులు ఏళ్ల తరబడి మకాం వేస్తున్నారని పోలీసులే చెబుతున్నారు. అలా గతంలో కొందరు నిఘా వర్గాలకు పట్టుబడ్డారు కూడా. ఇక ఇప్పుడు తాజాగా చైనా గూఢచారి జున్వే 2010లో హైదరాబాద్‌ ఉన్నట్టు అంగీకరించాడు. దీంతో .. హైదరాబాద్ అక్రమ శక్తుల అడ్డాగా మారుతోందా అన్న చర్చ మరోసారి మొదలైంది.



దేశంలో హైదరాబాద్‌ మహా నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ఉద్యోగం కోసం ఇక్కడకు వస్తుంటారు. అలాగే హైదరాబాద్ ఉన్నత విద్య కేంద్రం కూడా. విద్య, వైద్యం కోసం వేలాది మంది విదేశీయులు హైదరాబాద్ వస్తుంటారు. అంతే కాదు. దేశరక్షణకు సంబంధించిన పరిశోధన సంస్థలు, విభాగాలు కూడా హైదరాబాద్‌లో ఉన్నాయి. అందుకే ఇలాంటి కీలక నగరాన్ని విదేశీ శక్తులు టార్గెట్ చేస్తున్నాయన్న వాదన ఉంది. వారి ఆటలు కట్టించేలా పకడ్బందీ రక్షణ వ్యవస్థ హైదరాబాద్‌కు అత్యవసరం.



మరింత సమాచారం తెలుసుకోండి: