ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్‌కు పీకల్దాకా కోపం ఉన్న సంగతి తెలిసిందే.. అయితే ఆ కోపానికి అసలు కారణం ఏంటన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.  ఈటల రాజేందర్ కేసీఆర్‌కే వెన్నుపోటు పొడుద్దామని ప్రయత్నించారని.. ఆ విషయం కనిపెట్టిన కేసీఆర్.. ఈటల భూ అక్రమాలను బయటపెట్టించి.. ఆయన్ను పదవి నుంచి బర్తరఫ్‌ చేశారని కొందరు చెబుతుంటారు. ఇందులో వాస్తవం ఏంటో వారికే తెలియాలి.


ఉద్యమంలో మొదటి నుంచి చురుకుగా ఉన్న ఈటల రాజేందర్‌.. పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. కేసీఆర్‌ దగ్గర కూడా మంచి పరపతి ఉండేది. ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిగా కూడా కేసీఆర్ క్యాబినెట్‌లో పని చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా వైద్యశాఖ వంటి కీలక బాధ్యతలు చూశారు ఈటల రాజేందర్. అయితే మొత్తానికి ఎక్కడో చెడింది. ఈటల బలవంతంగా పార్టీ వదిలి బయటకు రావాల్సి వచ్చింది. ఇక కేసీఆర్ పై పోరాటం చేయక తప్పని పరిస్థితుల్లో ఈటల బీజేపీ పంచన చేరారు.


అందుకే.. హుజురాబాద్‌ ప్రచారంలో భాగంగా.. కేసీఆర్‌కు తాను అసెంబ్లీకి రావడం ఇష్టం లేదని.. అసెంబ్లీలో తన ముఖం చూసేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదని.. అందుకే ఎన్ని వందల కోట్లయినా ఖర్చు చేసి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఈటల స్వయంగా అన్నారు. అయితే.. ఎన్ని చేసినా జనం బలం మాత్రం ఈటల వైపే ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనేక సర్వేలు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు ఖాయం అని చెబుతున్నాయి.


మరి ఈ సర్వేలే నిజమై.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ నెగ్గితే ఏమవుతుంది.. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా.. ఈటల ముఖం అసెంబ్లీలో చూడాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీని కూడా బహిష్కరిస్తారా.. గతంలో ఓసారి ఎన్టీఆర్ ఇలాగే.. కోపంతో అసెంబ్లీని బహిష్కరించారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లి గెలిచాకే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా ఈటల గెలిస్తే అదే పని చేస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: