కొన్నాళ్ల క్రితం వచ్చిన జైభీమ్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ఓ గిరిజనుడిపై పోలీసులు చేయని నేరం మోపుతారు.. నేరం ఒప్పుకోమని చిత్రహింసలు పెడతారు.. గొడ్డును బాదినట్టు బాదుతారు.. ఆ హింస తట్టుకోలేక.. చేయని నేరం ఒప్పుకోలేక.. ఆ గిరిజనుడు నరక యాతన అనుభవిస్తాడు. చివరకు పోలీస్‌ లాకప్‌లోనే మరణిస్తాడు.. ఇదీ దేశాన్ని కదిలించిన సినిమా.. ఓ యథార్థగాధ ఆధారంగా తమిళంలో వచ్చిన ఈ సినిమా ఇటీవల ఆస్కార్ బరిలోనూ నిలిచింది. ఉత్తమ విదేశీభాషా చిత్రం కేటగిరిలో అవార్డు కోసం పోటీ పడుతోంది. అంతే కాదు.. ఐఎండీబీలో ఈ సినిమాకు అత్యున్నతమైన రేటింగ్ వచ్చింది.


ఇదందా ఓ అమాయకుడికి జరిగిన అన్యాయం కథ.. అందుకే అంతగా ఆకట్టుకుంది. అయితే.. ఇదే సినిమా తరహాలో చిత్తూరు జిల్లాలో ఇటీవల ఓ సంఘటన జరిగింది. కాలం మారినా దళితుల బతుకులు మారలేని ఈ కొత్త సంఘటన మరోసారి రుజువు చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిత్తూరు జైలు సూపరింటెండెంట్‌ ఇంట్లో 2 లక్షల రూపాయల డబ్బు పోయింది.. ఆ ఇంటి పని మనిషిపై జైలు సూపరింటెండ్‌కు అనుమానం ఉంది. అంతే.. కేసు  పెట్టేశారు.


విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్‌నకు పిలిపించి.. మహిళ అని కూడా చూడకుండా గొడ్డును బాదినట్టు బాదారు.. ఆమె వీపు ఎంతగా కమిలిపోయిందంటే.. ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి దెబ్బలు చూపిస్తుంటే.. ఫోటోలు తీస్తున్న కెమేరామెన్‌ల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంత కంటే దారుణం ఏంటంటే.. బాధితురాలిని విపరీతంగా కొట్టి ఎలాగోలా నేరం ఒప్పించిన తర్వాత.. అసలు విషయం తెలిసింది.. అదేటంటే ఘటనా స్థలంలోని వేలి ముద్రలు బాధితురాలివి కావని తేలింది.


అంతే.. ఇక నిన్ను ఇబ్బంది పెట్టం లే.. కేసుగీసూ ఏమీ లేదు.. వెళ్లి మేం కొట్టిన దెబ్బలకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకో.. కావాలంటే.. ఆ ఖర్చులు మేం పెట్టుకుంటాం అని చెప్పారట. ఆ తర్వాత ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చేసరికి ఎవరో ఒకరిని బలిపెట్టాలి కదా. అందుకే.. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారన్న కారణందో కానిస్టేబుల్‌ సురేశ్‌ బాబును  సస్పెన్షన్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: