తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. పలు చోట్ల ఆధ్యాత్మిక సంబరాలు సాగుతున్నాయి. శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో సహస్రాబ్ది ఉత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. రథసప్తమి సందర్భంగా ముచ్చింతల్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దుష్టగ్రహ బాధల నివారణ కోసం యాగశాలలోశ్రీ నారసింహ ఇష్టి, సర్వవిధ పాప నివారణ కోసం శ్రీమన్నారాయణ ఇష్టి, లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణం,  
ప్రవచన మండపంలో శ్రీనారసింహ అష్టోత్తర శతనామావళి పూజ ఉంటాయి. సామూహిక ఆదిత్య పారాయణం సహా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముచ్చింతల్‌లో రామానుజ విగ్రహాన్ని ఇవాళ హోమంత్రి అమిత్‌ షా దర్శించుకోనున్నారు. సాయంత్రం 4.40కి శంషాబాద్‌ చేరుకోనున్న అమిత్‌ షా.. ముచ్చింతల్‌లో 108 దివ్యక్షేత్రాలను సందర్శిస్తారు. యాగశాల పూజల్లో పాల్గొంటారు.


అటు తిరుమలలో రథసప్తమి వేడుకలు ఉన్నాయి. సప్తవాహనాలపై వెంకన్న దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ, చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవలు ఉంటాయి. సాయంత్రం కల్పవృక్ష, సర్వభూపాల వాహన సేవలు ఉంటాయి. రాత్రికి చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది. కొవిడ్‌ కారణంగా వేడుకలు ఏకాంతంగా నిర్వహిస్తారు. కరోనా కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవలు, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు.  


ఇక శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలోనూ ఘనంగా రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. తొలిపూజ చేసిన ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని సభాపతి తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. రేపు విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాల్లో జరగనున్నాయి. వీటిలో  సీఎం జగన్ పాల్గొంటారు.


మరోవైపు యాదాద్రి ఆలయం కూడా పునర్నిర్మాణం తర్వాత ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ ఆలయ పనులను సీఎం కేసీఆర్ నిన్న దగ్గరుండి పరిశీలించారు. నల్గొండలోనూ ఇవాళ్టి నుంచి చెర్వుగట్టులో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఆరు రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మొత్తం మీద ఎటు చూసినా తెలుగు రాష్ట్రాల్లో భక్తి రసం ఏరులై పారుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: