అవ‌కాశం.. అవ‌స‌రం.. ఈ రెండు ఎంతటి రాజ‌కీయ నేత‌ల‌నైనా.. అనూహ్యంగా ప‌థం మార్చుకునేలా.. పెద‌వి మార్చుకునేలా కూడా ప్రోత్స‌హిస్తాయి. ఇప్పుడు జాతీయ రాజ‌కీయంలో కూడా.. అదే జ‌రుగుతోంది. తాజాగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. అనంత‌పురంలో ప‌ర్య‌టించారు. ఏవో ప్రారంభోత్స‌వాలు, శంకుస్తాప‌న‌లు చేశారు. అయితే.. ఈ క్ర‌మంలోనే ఆమె ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``సీఎం జ‌గ‌న్ త‌ర‌చుగా ఢిల్లీకి వ‌స్తారు. ఆయ‌న ఎప్పుడు వ‌చ్చినా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని క‌లుస్తారు!`` అన్నారు. అక్క‌డితో ఆగ‌కుండా.. ప్ర‌ధాని నరేంద్ర మోడీ.. జ‌గ‌న్‌ను ఒక కుమారుడిగా ఆప్యాయంగా చూస్తారు. అన్నారు.

ఈ వ్యాఖ్య‌.. రాజ‌కీయంగా రెండు కార‌ణాల‌కు దారితీస్తోంది. ఒక‌టి.. జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్ట‌డం.. రెండు.. రాజ‌కీయం గా బీజేపీని ప్రోత్స‌హించ‌డం. దీంతో ఇప్పుడు ఈ విష‌యం.. విప‌క్షాల‌కు ఆయుధంగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీతో అంటీముట్ట‌న‌ట్టుగానే వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనివ‌ల్ల కీల‌క‌మైన మైనారిటీ ఓటు బ్యాంకు వైసీపీతోనే ఉంది. కానీ, మోడీ.. ఏకంగా జ‌గ‌న్‌ను క‌న్న‌బిడ్డ‌లా చూస్తున్నారంటే.. వీరిద్ద‌రి మ‌ధ్య ఇంత `బంధం` ఉందా.? అనే చ‌ర్చ జోరుగా తెర‌మీదికి వ‌చ్చింది. ఇది రాజ‌కీయంగానే కాకుండా.. రాష్ట్ర అభివృద్ధి ప‌రంగా.. కూడా ఇబ్బందిగా మారింది.

ఎలాగంటే.. జ‌గ‌న్‌కు మోడీతో అంత స‌న్నిహిత సంబంధం ఉంటే.. ఏపీకి అభివృద్ధి నిధులు ఎందుకు తేలేక పోతున్నారు?  హోదా పై ఎందుకు నిల‌దీయ‌లేక పోతున్నారు? అనేవి కీల‌కంగా మారాయి. ఇక‌, నిర్మ‌ల వ్యాఖ్య‌ల్లో మ‌రో కోణం.. మోడీని హైలెట్ చేసి.. బీజేపీని పుంజుకునేలా చేయ‌డం. మోడీ.. జ‌గ‌న్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి.. ఏపీని ఎంత‌గానో ఆద‌రిస్తున్నార‌నేది.. నిర్మ‌ల‌మ్మ ఉద్దేశం. త‌ద్వారా.. ఏపీలో ఏం జ‌రిగినా.. మోడీ చేస్తున్నారు.. అనే కోణంలో ఆమె వ్యాఖ్యానించిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త‌ద్వా రా.. మోడీ చేస్తున్న అభివృద్ధిని బీజేపీ నేత‌లు అందిపుచ్చుకుని ముందుకు సాగాల‌నే అంత‌రార్థం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశృల‌కులు.

మొత్తానికి నిర్మ‌ల‌మ్మ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా ప్రాధాన్యంతో పాటు చ‌ర్చ‌కు కూడా దారితీశాయి. మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ ద‌గ్గ‌ర అస‌లు జ‌గ‌న్‌కు అప్పాయింట్‌మెంటే దొర‌క‌డం క‌ష్టంగా ఉంద‌ని భావించిన కొంద‌రు నేత‌ల‌కు, కొన్ని వ‌ర్గాల మీడియాకు ఇప్పుడు ఇది పెద్ద స‌మాధాన‌మే అయిన‌ప్ప‌టికీ.. రాబోయే రోజుల్లో ప్ర‌ధాని ద‌గ్గ‌ర `కొడుకు` లాంటి అనుబంధం ఉంచుకుని కూడా జ‌గ‌న్ ఏమీ సాధించ‌లేక పోయార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చేందుకు ఆస్కారం క‌ల్పిస్తున్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: