ఇదే రాజకీయ నాయకులు.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. జగన్ సర్కారు పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ వాళ్లను వేధిస్తున్నారని.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. చంద్రబాబు మండిపడుతున్నారు. ఇలా వైసీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నవారందరినీ గుర్తు పెట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు.
మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి వస్తుందని.. అప్పుడు అందరి పని పడతామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. చట్టం ఉల్లంఘించే అధికారులకు ఖాకీ బట్టలు వేసుకునే హక్కు లేదంటున్న చంద్రబాబు.. సోషల్ మీడియా పోస్టు పెట్టడమే నెరమైతే నారాసుర రక్త చరిత్ర కథనం రాసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి పూట, గోడ దూకి ఇంట్లోకి వెళ్లి బిడ్డకు పాలిస్తున్న తల్లిని కూడా పట్టించుకోకుండా అరెస్ట్ లు చేస్తారా.. పోలీసులకు మానవత్వమే లేదా..అని మండిపడుతున్నారు.
పోలీసులు వచ్చి అర్ధరాత్రి తలుపులు తడితే కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. వెంటనే పార్టీకి సమాచారం ఇవ్వాలని.. న్యాయవాదుల్ని అప్రమత్తం చేస్తామని చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు అభయం ఇస్తున్నారు. ఏదేమైనా అటు అధికారంలో ఉన్న జగన్... ఇటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు.. మధ్యలో పోలీసులు మాత్రం నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడువ మంటే పాముకు కోపం అన్నట్టుంది పోలీసుల పరిస్థితి. ఇదే చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసిన విషయం మాత్రం మర్చిపోతున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కొందరు పోలీసులు చేసే ఏ ఒక్క అరాచకాన్నీ మర్చిపోమంటున్న చంద్రబాబు.. గతం గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి