ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. బీసీలకు అధిక సీట్లు కేటాయిస్తూ.. సోషల్ ఇంజినీరింగ్ విధానాన్ని జగన్ పాటిస్తుంటే.. జనసేన తో పొత్తు ద్వారా కాపు సామాజిక వర్గ ఓట్లతో పాటు యూత్ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు భావించారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సారి టీడీపీ మద్దతు తో అయినా అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిథ్యం కల్పించాలని పవన్ టీడీపీతో కలిసి నడిచేందుకు సిద్ధం అయ్యారు.


అయితే టీడీపీ, జనసేన మధ్య ఓట్లు బదలాయింపు సక్రమంగా జరుగుతుందా అనే అనుమానాలు ఇరు పార్టీల్లోను ఉంది. మరోవైపు వైసీపీ కూడా ఇది జరిగితే తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన చెందుతుంది. అందుకే పవన్ పై సైకిలాజికల్ గా విమర్శలు చేస్తోంది. ఇన్ని తక్కువ సీట్లు తీసుకొని కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారు అని ఓ మైండ్ గేమ్ ను స్టార్ట్ చేసింది.


ఒకవేళ అక్కడ వైసీపీ అభ్యర్థి కాపు అయితే కాపు ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గత ఎన్నికల్లో పవన్ కూడా కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ స్థానిక నాయకులు బలంగా ఉన్నారు. ఇప్పుడు కూడా స్థానికంగా వారికి ఉన్న మంచిపేరు.. స్థానికులతో సత్సంబంధాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొనే జనాలు ఓట్లేస్తారు అని విశ్లేషకులు చెబుతున్నారు.


మరో వైపు గతంలో లాగా కమ్మ వర్సెస్ కాపు అనే యుద్ధ వాతావరణం ఇప్పుడు లేదు. వైసీపీని ఓడించాలి అనే నినాదంతో ఈ రెండు పార్టీలు కలిశాయి. ఆ విధంగానే ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆశించిన సీట్లు గెలవడానికి జనసేనకు ఇదో మంచి అవకాశంగా పలువురు పేర్కొంటున్నారు. ఇదే సందర్భంలో టీడీపీ విజయానికి కూడా ఈ కూటమి  ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: