తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ రావును అరెస్టు చేసిన పోలీసులు.. ట్యాపింగ్ కేసులో ఆయన పాత్రపై విచారణ జరిపారు. ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ట్యాపింగ్‌ చేసినట్లు మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ రావు ఒప్పుకున్నట్టు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతే కాదు. రాజకీయ నేతలు, ఇతర వ్యక్తులపై నిఘా పెట్టినట్లు కూడా మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ రావు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.


రాజకీయంగా పక్షపాతంతో కొన్ని చర్యలు చేపట్టినట్లు కూడా మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ రావు ఒప్పుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ సమయంలో డబ్బు స్వాధీనంలో అక్రమాలు జరిగాయని.. ఇతర నిందితులతో కలిసి సాక్ష్యాలు ధ్వంసం చేశారని మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌ రావు అంగీకరించారని తెలిసింది. రాధాకిషన్‌ రావును అరెస్టు చేసి జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు.. కోర్టు రిమాండ్ విధించడంతో రాధాకిషన్‌ను చంచల్‌ గూడ జైలుకు తరలించారు.


టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని గత ప్రభుత్వ పాలనకులు అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాధాకిషన్‌ రావు చాలా అరాచకాలు చేసినట్టు గుర్తించారు. బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా రాధాకిషన్‌ రావు వ్యవహరించారని.. ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారని కూడా అనుమానిస్తున్నారు.


మరీ దారుణం ఏంటంటే.. ఏకంగా టాస్క్‌ఫోర్స్‌ వాహనాల్లోనే రాధాకిషన్‌ రావు డబ్బు తరలింపు చేపట్టారని తెలుస్తోంది. హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్‌ రావు టీమ్‌ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసు వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఇలా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాలు చూస్తుంటే.. కేసీఆర్‌ మరీ ఇన్ని అరాచకాలు చేయించారా అని ఆశ్చర్యపోకమానరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr