రాజకీయాల్లో వారసత్వం ఈనాటిది కాదు. వారసత్వ రాజకీయాలు తెలుగు నేలకు కొత్త కూడా కాదు. అయితే ఏపీలోని రాజకీయ దిగ్గజ కుటుంబం నందమూరి కుటుంబం. నందమూరి, నారా కుటుంబాల నుంచి ఈసారి కూడా ముగ్గురు బరిలో దిగబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి, నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా బరిలో దిగుతుండగా.. నారా లోకేశ్‌ మరోసారి మంగళగిరి బరి నుంచే పోరాటం చేయనున్నారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ముగ్గురూ ఈ మూడు స్థానాల నుంచే పోటీ చేశారు. చంద్రబాబు, బాలయ్య విజయం సాధించగా.. లోకేశ్ మాత్రం మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నారా లోకేశ్‌ పోరాడుతుంటే.. లోకేశ్‌తో పాటు చంద్రబాబు, బాలయ్యలను కూడా ఈసారి ఓడించాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది.


కుప్పంలో చంద్రబాబునే ఓడించి బిగ్‌ షాక్‌ ఇవ్వాలని వైసీపీ కొన్నేళ్లుగా అక్కడ గ్రౌండ్ వర్క్‌ చేసుకుంటోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ.. ఇక్కడ టీడీపీకి చుక్కలు చూపించింది. కుప్పం మున్సిపాలిటీని కూడా భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. గతంలో చంద్రబాబుపై పోటీ చేసి ఆయన మెజార్టీని గణనీయంగా తగ్గించిన చంద్రమౌళి కుమారుడు భరత్‌ ఈసారి చంద్రబాబుపై పోటీ చేస్తున్నారు. ఇటీవల కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం సుబ్రహ్మణ్యం నాయుడు వైసీపీలో చేరడం ఆ పార్టీకి కలసివచ్చే అంశం. ఈయన్ను చంద్రబాబు కుడిభుజంగా చెబుతారు.


ఇక మంగళగిరిలో నారా లోకేశ్‌, హిందూపురంలో బాలకృష్ణల గెలుపుకు పెద్దగా అడ్డంకులు ఉండకపోవచ్చని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలో ఓడినా మంగళగిరినే అంటి పెట్టుకుని ఉన్న నారా లోకేశ్‌ కొన్నేళ్లుగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా పట్టు సంపాదించారు. ఇక్కడ వైసీపీ చేనేత వర్గానికి చెందిన బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలో దింపింది. ఇక హిందూపురంలో వైసీపీలో వర్గపోరు బాలయ్య విజయాన్ని మరింత సులభతరం చేసే అవకాశం ఉంది. మొత్తానికి నందమూరి, నారా కుటుంబానికి చెందిన ఈ ముగ్గురూ విజయం సాధించే అవకాశాలే కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: