నా అనుభవం అంత లేదు నీ వయస్సు.. నాకు పాఠాలు చెబుతావా.. ఇదీ ఇటీవల ఓ ఎన్నికల ప్రసంగంలో చంద్రబాబు జగన్‌ను ఉద్దేశించి కొట్టిన డైలాగ్‌. మరీ అంత కాదు కానీ.. నిజంగానే చంద్రబాబు అనుభవం ముందు జగన్‌ అనుభవం చాలా తక్కువే. ఇప్పుడా అప్పుడా.. చంద్రబాబు 1978లోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1980లలోనే మొదటి సారి మంత్రి అయ్యారు. ఆ తర్వాత తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్‌ వెనుక ఉండి నడిపించి.. తెర వెనుక రాజకీయంలో కాకలు తీరారు.


ఇక ఎన్టీఆర్‌ తదనంతరం కేంద్రంలో చక్రం తిప్పారు. ఒక దశలో దేశ ప్రధానులను, రాష్ట్రపతులను డిసైడ్‌ చేసే రేంజ్‌కు వెళ్లారు. స్వయంగా తనకే ప్రధాని మంత్రి పదవి అవకాశం వచ్చినా కాదనుకున్నానని చెబుతారు. ఇదంతా ఎప్పుడు..? 1990లలో.. బహుశా అప్పటికి జగన్‌ ఏ కాలేజీ చదువుల్లోనో ఉండి ఉంటారు. 2004 నుంచి చంద్రబాబు రాజకీయం పదును తగ్గింది. వ్యూహాలు బెడిసికొట్టాయి. 2004లో వైఎస్‌ అధికారంలోకి రావడం.. ఆయన మరణంతో జగన్‌.. సొంత పార్టీ పెట్టడం.. జనంలో ఇమేజ్‌ సంపాదించుకోవడం జరిగిపోయాయి.


2014లోనే చంద్రబాబుకు దాదాపు చుక్కలు చూపించేసిన జగన్.. చంద్రబాబు సీనియారిటీకి జనం మొగ్గడంతో త్రుటిలో అధికారం తప్పిపోయింది. ఆ తర్వాత కూడా జగన్‌ దూకుడుతో, పదునైన వ్యూహాలతో ముందుకెళ్లాడు. అదే సమయంలో చంద్రబాబు ప్రభ క్రమంగా క్షీణదశకు చేరుకుంది. ఒకప్పుడు పార్లమెంటులోనే రెండో అతి పెద్ద పార్టీగా ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం.. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ పార్టీ స్థాయికి.. ఆ తర్వాత ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. తెలుగు దేశం ఊపిరిపోసుకున్న తెలంగాణ ప్రాంతంలో పార్టీ దాదాపు కనుమరుగై ఒక్క ఏపీకే పరిమితమైంది.


మరోవైపు దూకుడు, పట్టుదల, విశ్వసనీయత, పేదల పక్షం వంటి లక్షణాలతో జగన్‌ జనానికి చేరువయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలు విస్తుపోయేలా ఏకంగా 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు గెలుచుకుని.. తెలుగు దేశాన్ని కేవలం.. ఆ పార్టీ చరిత్రలోనే అతి తక్కువ సీట్లుకు పరిమితం చేశారు. ఐదేళ్ల తర్వాత మరోసారి ప్రజాతీర్పు కోరబోతున్న జగన్‌.. ఈసారి కూడా గెలుపుపై ధీమాగానే ఉన్నాడు. తన పాలనలో మేలు జరిగితేనే ఓటేయమని ప్రజలను కోరుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: