సీఎం జగన్‌ను గద్దె దించాల్సిందే అన్న పట్టుదలతో ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక వ్యూహాలు రచించారు. సొంతగా 2019 తరహాలోనే ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదన్న భయంతో చంద్రబాబు పొత్తుల వ్యూహాలు రచించారు. గతంలో ఎన్ని తిట్లు తిట్టుకున్నా.. ఎంతగా విబేధించుకున్నా పవన్‌తో కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు పవన్‌ను ఒప్పించారు. అంత వరకూ చంద్రబాబు చాలా సక్సస్‌ అయ్యారనే చెప్పుకోవాలి.


అయితే.. బీజేపీతో మొదటి నుంచి భాగస్వామినని చెప్పుకుంటున్న పవన్‌ కల్యాణ్‌.. ఆ పార్టీ కూడా కూటమిలో ఉండాలని పట్టుబట్టడం.. చంద్రబాబు కూడా ఎన్నికల్లో నెగ్గాలంటే కేంద్రం అండ ఉంటేనే మంచిదన్న అభిప్రాయంతో ఉండటంతో బీజేపీ పొత్తు కోసం ప్రయత్నాలు సాగించారు. ఇందు కోసం చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే ఎన్నడూ లేనంతగా మెట్లు దిగారు. టీడీపీ పొత్తుకు అంతగా సముఖంగా లేని బీజేపీని బలవంతంగా పొత్తుకు ఒప్పించారు. ఇందుకు ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. మోడీ, అమిత్‌షాతో పొత్తుల కోసం భేటీ అయిన తర్వాత నెల రోజుల వరకూ పొత్తుల ఖరారు కోసం వేచి చూడాల్సి వచ్చింది. అన్నాళ్లూ బీజేపీ నేతలు స్పందించకపోయినా చంద్రబాబు చాలా ఓపికగా ఎదురు చూసారు.


ఎలాగైనా సరే.. పొత్తులు సాధించాలి.. జగన్‌ను దించాలన్న అన్న పట్టుదలతో చంద్రబాబు రాజకీయం సాగించారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. మళ్లీ ఎన్డీఏలోకి అడుగుపెట్టగలిగారు. హమ్మయ్య.. పొత్తులు కుదిరాయి.. ఇక దిగుల్లేదు.. జగన్‌ను దింపేసినట్టే అని సంబరంగా అనుకున్నంత సేపు కూడా చంద్రబాబు ఆ సంతోషం నిలవలేదు. జనసేనతో పొత్తు తర్వాత క్యాడర్‌లో కనిపించిన ఊపు కాస్తా.. బీజేపీతో పొత్తుతో తుస్సుమనడం ప్రారంభించింది.


ఇక పొత్తులో కుదిరిన సీట్ల లెక్కలు చూస్తేనే చంద్రబాబు ఏ స్థాయిలో రాజీపడ్డారో అర్థం చేసుకోవచ్చు.. ఏపీలో ఒక్క శాతం కూడా ఓట్లు లేని బీజేపీకి ఆయన ఏకంగా పది అసెంబ్లీ సీట్లు కట్టబెట్టారు. ఏకంగా ఆరు లోక్‌సభ సీట్లు ఇచ్చేశారు. పొత్తుల విషయంలో పవన్‌ కల్యాణ్‌ను తక్కువ సీట్లకు ఒప్పించడంలో సఫలమైన చంద్రబాబు ఎత్తులు జిత్తులు బీజేపీ అగ్రనేతల ముందు మాత్రం ఉడకలేదు.


ఎన్నికల సందడికి కొన్ని నెలల ముందు.. 50-60 సీట్లలో పోటీ చేయాలని భావించిన పవన్‌ కల్యాణ్‌.. ఎందుకో ఆ తర్వాత బాగా తగ్గారు. ఎలాగైనా సరే జగన్‌ను గద్దె దింపాలని కంకణం కట్టుకున్న పవన్‌.. సీట్ల విషయంలో రాజీపడ్డారు. 50 నుంచి 24 సీట్లకు తగ్గారు. మొదట్లో అంతా పవన్‌ కల్యాణ్‌ అన్ని తక్కువ సీట్లకు ఎలా ఒప్పుకున్నాడబ్బా అని ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు చూస్తే సీన్‌ పూర్తిగా మారిపోయింది. ఆ ఒప్పుకున్న 24 సీట్లలో మరో ముడు బీజేపీ కోసం పవన్ త్యాగం చేశారు. ఆ మిగిలిన 21 సీట్లుకు కూడా పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థులను నిలపలేక సతమతమయ్యారు.


ఆ 21 సీట్లలో ఓ పదిసీట్ల వరకూ టీడీపీ నుంచి, వైసీపీ నుంచి వలస వచ్చిన వారికే అప్పగించి పవన్‌ చేతులు దులుపుకున్నారు. ఈ పరిస్థితి చూసి జనసైనికులే ఆశ్చర్యపోతున్నారు. 21 సీట్లలోనే సొంత అభ్యర్థులను నిలపలేకపోయిన పవన్‌ కల్యాణ్‌.. ఒకవేళ 50 సీట్లు తీసుకుంటే ఎలా నిలిపేవారో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక పవన్‌ ప్రచారంలోనూ చంద్రబాబుకు సాగిలపడినట్టే చేస్తున్నారు. ప్రతి సభలోనూ చంద్రబాబు మహానుభావుడు అన్నట్టుగానే లెక్చర్లు దంచుతున్నారు.

   
జనసేన సంగతి ఇలా ఉంటే.. టీడీపీ సంగతి మరోలా ఉంది. కూటమిలో కీలక భాగస్వామ్యం తెలుగుదేశందే అయినా.. కూటమి సీట్ల పంపకంలో పెత్తనం మాత్రం బీజేపీ పెద్దలదే అన్నట్టుగా సాగుతోంది. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల ఎంపికలోనూ బీజేపీ నేతదే కీలక నిర్ణయంగా మారుతోంది. ఆ పార్టీ ఎంచుకున్న సీట్లనే ఇవ్వకతప్పని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు పూర్తిగా బీజేపీకి దాసోహం అన్నట్టుగా.. వ్యవహరించడం క్యాడర్‌ను ఇబ్బంది పెడుతోంది. చివరకు దెందులూరు వంటి టీడీపీ బలమైన స్థానాన్ని బీజేపీ అడిగినా నో చెప్పేందుకు చంద్రబాబు కిందామీదా పడుతున్నారు. చివరకు క్యాడర్‌ గట్టిగా తేల్చి చెప్పడంతో చంద్రబాబు ఆ సీటు బీజేపీకి ఇవ్వలేదు.


ఈ మొత్తం సీన్‌లో లాభపడిన బీజేపీ మాత్రం.. కష్టమంతా టీడీపీ, జనసేనది.. సీట్లు మాత్రం మావి అన్నట్టు ప్రవర్తిస్తోంది. మూడు పార్టీలు కలిసి ఓ మహా శక్తిగా వెళ్తాయని భావించినా.. అపోహలు, సర్దుబాట్లు, అలకలు, బెదిరింపులు, బుజ్జగింపులతోనే కాలం గడిచిపోతోంది. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా పది, పదిహేను పార్టీలను సమన్వయం చేసి.. ప్రధాని, రాష్ట్రపతుల ఎంపికలకో కీలకపాత్ర పోషించిన చంద్రబాబేనా.. ఈ మూడు పార్టీల కూటమిని చక్కదిద్దలేక చతికిలపడుతున్నది అనిపిస్తోంది. ఇకనైనా కూటమి నేతలను చంద్రబాబు సరిగ్గా నియంత్రించకపోతే.. కూటమి కుదురుకోకపోతే.. జగన్‌ చేతిలో చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్నది చేదు వాస్తవమనే చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: