పార్టీలను వణికిస్తున్న క్రాస్‌ ఓటింగ్ భయం..
లోక్‌సభ అభ్యర్థి సత్తా ఆధారంగా క్రాస్‌ ఓటింగ్‌..
కులం, పార్టీల మధ్య అవగాహనా కారణమే..

క్రాస్‌ ఓటింగ్‌.. రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారికి ఈ పదం సులభంగానే అర్థమవుతుంది. ఏపీలో సాధారణంగా అసెంబ్లీకి, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుంటాయి. అందువల్ల.. ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయించే అసెంబ్లీ ఓటు.. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించే లోక్‌సభ ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే.. గతంలో ఏ ఓటరు అయినా తాము వేయాలనుకున్న పార్టీకే అసెంబ్లీకి, లోక్‌సభ.. రెండింటికీ ఒకే గుర్తుకు ఓటు వేసేవారు.


కానీ ఆ తర్వాత ట్రెండ్ మారింది. ఒక్కో లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ వరకూ ఉంటాయి. కొన్నిచోట్ల అసెంబ్లీకి ఓ పార్టీకి, లోక్‌సభకు మరో పార్టీకి ఓటు వేయాడాన్నే క్రాస్‌ ఓటింగ్‌ అంటారు.
ఎంపీ అభ్యర్థికి ఉన్న పలుకుబడి, నేపథ్యం ఆధారంగా ఈ క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుంది. ఉదాహరణకు గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్‌ జరిగింది. విజయవాడ లోక్‌సభ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్క చోట మినహా మిగిలిన ఆరు చోట్ల వైసీపీ గెలిచింది. ఆ లెక్క ప్రకారం విజయవాడ లోక్‌సభ కూడా వైసీపీ గెలిచి ఉండాలి.


కానీ.. అక్కడ మాత్రం టీడీపీకి చెందిన కేశినేని నాని గెలిచారు. అంటే జనం అసెంబ్లీకి ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి.. లోక్‌సభ విషయానికి వచ్చేసరికి సైకిల్‌కు గుద్దేశారన్నమాట. అలాగే గుంటూరు లోక్‌సభ కూడా ఇక్కడ కూడా టీడీపీ ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలిచింది. మిగిలిన ఆరింటిలోనూ వైసీపీయే గెలిచింది. లోక్‌సభలో మాత్రం గల్లా జయదేవ్‌ గెలిచారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ సీటు కూడా. ఇక్కడ కూడా రెండు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచినా.. మిగిలిన ఐదు అసెంబ్లీలో వైసీపీయే గెలిచినా లోక్‌సభ సీటు మాత్రం టీడీపీయే గెలిచింది.


ఈ క్రాస్‌ ఓటింగ్‌కు లోక్‌సభ అభ్యర్థుల పేరు, ప్రతిష్టలతో పాటు సామాజిక వర్గాలు, పార్టీల మధ్య అవగాహన కూడా కారణం అవుతాయి. రాష్ట్రం వరకు అసెంబ్లీ సీట్లు కీలకం. అందువల్ల అసెంబ్లీకి మా పార్టీకి వేయండి.. లోక్‌సభ మీ ఇష్టం అని చెప్పేవారు ఉంటారు. ఇలా అనేక కారణాల కారణంగా ఈ క్రాస్ ఓటింగ్‌ జరుగుతుంది. తాజాగా కడపలోనూ ఈ క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని షర్మిల గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నది కూటమి నేతల మాట. మరి ఈసారి ఏ రేంజ్‌లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందో వచ్చేనెల 4న కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: