100శాతం గెలుపు తమదేనంటున్న కూటమి
క్షేత్ర స్థాయి సమాచారంతో టీడీపీ ఖుుషీ ఖుషీ
3, 4 జిల్లాల్లో వైసీపీ ఖాతా కూడా తెరవదట

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీలకు ఉన్నాయి. ప్రతి పార్టీ కూడా తమకు తాము సొంతంగా సర్వేలు చేయించుకుంటూ గెలుపు ఓటములపై అంచనాలకు వస్తున్నాయి. కేవలం సర్వేలనే నమ్ముకోకుండా.. తమ క్షేత్ర స్థాయి నాయకుల నుంచి సమాచారం తెప్పించుకుని.. సర్వే ఫలితాలతో బేరీజు వేసుకుని ప్రతి ఒక్క సీటుపై ఓ అంచనాకు వస్తున్నారు.


తాజాగా ఇలా చేయించుకుంటున్న సర్వేలు.. తెప్పించుకుంటున్న సమాచారం ఆధారంగా టీడీపీ అగ్రనేతలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని.. అది కూడా టైట్‌ ఫైట్‌లో కాకుండా ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసి టీడీపీ నేతలకు సమాచారాన్ని అందిస్తున్నాయి. అలా అందిన సమాచారం ప్రకారమే ఈసారి ఏపీలో కూటమికి ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ రాబోతోందని టీడీపీ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు.


ఇలా అందుతున్న సమాచారం మేరకు గతంలో వైసీపీ ఏ స్థాయి విజయం సాధించిందో దాదాపు అదేస్థాయిలో కూటమి కూడా విజయం సాధించబోతోందని తెలుగు దేశం నేతలు అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. ఇంచుమించు 150 వరకూ కూటమి సీట్లు సాధిస్తోందని ఆ పార్టీనేతలు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ అంచనాలు చూస్తే వావ్‌ ఇలా జరుగుతుందా అని అనిపించేలా ఉన్నాయి.


టీడీపీ నేతలు చెబుతున్న సమాచారం ప్రకారం ఏకంగా మూడు నాలుగు జిల్లాల్లో అసలు వైసీపీ ఖాతాయే తెరిచే అవకాశం లేదని చెబుతున్నారు. ప్రత్యేకించి ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రావడం కూడా కష్టమేనని చెబుతున్నారు. అలాగే విశాఖ పట్నం, గుంటూరు జిల్లాల్లోనూ వైసీపీ ఖాతా తెరవడం కష్టమేనట. ఇక వైసీపీకి బలంగా ఉంటుందని చెప్పుకునే సీమలోనూ టీడీపీ సునామీ సృష్టించబోతోందట. మరి పార్టీపై అభిమానంతో ఇచ్చిన సమాచారమా..నిజంగా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి ఉందా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సీట్ల లెక్కలు ఎలా ఉన్నా.. గెలుపు మాత్రం కూటమిదేనని పక్కగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: