డీజీపీగా పూర్తిగా సహకారం
కీలక స్థానాల్లో కోరిన అధికారులు
ఎన్నికల ముందు వరకూ పదవిలోనే

జగన్‌కు అండగా నిలచిన అధికారుల్లో డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. జగన్‌ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఏరి కోరి డీజీపీగా వేసుకున్నారు. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని జగన్‌ మొదట్లో ఇన్‌ఛార్జీ డీజీపీ గా నియమించారు. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వం రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగించింది. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంశాఖ పదే పదే లేఖలు రాసినా జగన్‌ ప్రభుత్వం ఖాతరు చేయలేదు.


సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ జగన్‌ ఏరికోరి రాజేంద్రనాథరెడ్డిని డీజీపీగా నియమించుకున్నారు. 1992 బ్యాచ్‌ అధికారైన ఆయన అదనపు డీజీపీ నుంచి డీజీపీ హోదాకి పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే 2020 ఫిబ్రవరి 15న జగన్‌ ప్రభుత్వం ఆయన్ను డీజీపీగా నియమించింది. అప్పటి వరకూ డీజీపీగా ఉన్న గౌతమ్‌సవాంగ్‌ను ఆకస్మికంగా తప్పించి.. ఆ స్థానంలో ఇన్‌ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథరెడ్డిని జగన్‌ నియమించుకున్నారు.


డీజీపీ  కేవీ రాజేంద్రనాథరెడ్డి కూడా జగన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తొలి నుంచి వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎల్లో మీడియా విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. వైసీపీపై, జగన్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారినీ కేసులతో వేధించారని ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసింది. అయినా ఆయన లెక్క చేయలేదు.


ఇక ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డి జగన్‌ సర్కారుకు అండగా నిలిచారనే చెప్పాలి. కీలక స్థానాల్లో కీలక అధికారులను నియమించుకోవడంతో రాజేంద్రనాథ్ రెడ్డి సహకరించారు. అందుకే ఎన్డీఏలో చేరిన తర్వాత టీడీపీ ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు వారి కృషి ఫలించింది కూడా. అయితే అప్పటికే పోలింగ్‌ సమయం దగ్గరపడటంతో ఆయన్ను బదిలీ చేసినా టీడీపీకి పెద్దగా ఒరిగిందేమీ లేదన్న వాదన ఉంది. మొత్తానికి జగన్‌కు అండగా నిలిచిన వారిలో రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రముఖంగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: