బీజేపీకి పునాది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆరెస్సెస్ నుంచి వచ్చిన అనేక అంగాల్లో రాజకీయ అంగమే బీజేపీ. దేశంలో తమదైన భావజాలంతో ఒక రాజకీయ పార్టీ  ఉండాలని అధికారం అందుకోవాలని ఆర్ఎస్సెస్ భావించింది. దాని ఫలితంగానే 1925లో ఆరెస్సెస్ ఏర్పాటు అయితే ఆ తర్వాత పాతికేళ్ల తర్వాత బీజేపీ ఆవిర్భావం జరిగింది.


అప్పట్లో జన్ సంఘ్ కానీ.. ఆ తర్వాత వచ్చిన బీజేపీ కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ సూచనలు, సలహాలు తీసుకుంటూ పనిచేసేవారు. అలాగే నరేంద్ర మోదీ సైతం ఆ సంస్థ నుంచి వచ్చిన వారే. మోదీ 2014లో ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీజేపీలో వ్యక్తి పూజ అధికం అయింది. బీజేపీలో వ్యక్తులకు ప్రాధాన్యం చాలా తక్కువ. పార్టీదే అగ్రస్థానం. కానీ గడిచిన పదేళ్లలో అన్నీ మోదీ ఇమేజ్ తోనే సాగాయి. రెండు సార్లు బీజేపీకి పూర్తి మెజార్టీ రావడంతో ఆరెస్సెస్ కూడా ఏమీ అనలేకపోయింది. ఈసారి సీట్లు తగ్గడంతో ఆరెస్సెస్ తన సొంత పత్రిక ఆర్గనైజర్ లో బీజేపీ నడక మీద పార్టీ పెద్దల పనితీరు మీద విమర్శలు గుప్పించింది. మితిమీరిన విశ్వాసంతో ఉన్న బీజేపీ నేతలకు ఈ ఫలితాలు గట్టిగానే బుద్ధి చెప్పాయని పేర్కొంది.  


మరోవైపు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.  నాగ్ పుర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిజమైన స్వయం సేవక్ అహంకారాన్ని ప్రదర్శించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నడుచుకుంటారన్నారు. ప్రస్తుతం మోదీ 3.0  ప్రభుత్వం నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడులపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు ఏకాభిప్రాయం కోసం జరిగే ప్రక్రియ అని .. పార్లమెంట్ లో ప్రతి సమస్యకు రెండు వైపులా ఆలోచించాలని.. ఒక పార్టీ ఒక వైపు ప్రస్తావిస్తే.. ప్రతిపక్ష పార్టీ మరోక కోణాన్ని ప్రస్తావించాలని అన్నారు.


ఈ సందర్భంగా ప్రతిపక్షాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. మణిపుర్ పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాలంగా శాంతి కోసం ఎదురు చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా శాంతి భద్రతలు ఉండగా.. ఒక్కసారిగా అక్కడ తుపాకీ సంస్కృతి పెరిగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడం ముఖ్యం అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: