కాపు కావడం వల్లే చినరాజప్పకు మిస్‌..
యూత్‌ కేటగిరిలో రామానాయుడికి పదవి..
పవన్‌, నారాయణకూ ఇవ్వక తప్పని పరిస్థితి..
చినరాజప్ప అనారోగ్యమూ ఓ కారణమే..

ఈసారి చంద్రబాబు కేబినెట్‌లో సీటు దక్కించుకోలేని సీనియర్లలో చిన రాజప్ప ఒకరు. చిన రాజప్ప.. పార్టీకి వీర విధేయుడుగా పేరుంది. అంతే కాదు.. చిన్న రాజప్ప.. స్థానికంగా మంచి పట్టు ఉన్న నాయకుడు. పార్టీకి వీర విధేయుడు కావడం వల్ల ఆయన 23 ఏళ్లపాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడే ఆయన్ను పార్టీ మంత్రి పదవితో అవకాశం ఇచ్చింది.


2014లో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి చిన రాజప్పను వరించింది. అంతే కాదు.. కీలకమైన హోంశాఖ బాధ్యతలను చంద్రబాబు చిన రాజప్పకు కట్టబెట్టారు. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ చినరాజప్ప ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. విపక్షంలో ఉన్నా పార్టీ పరంగా ఆయన కష్టించి పని చేశారనే చెప్పాలి. ఇక ఇప్పుడు 2014లోనూ చినరాజప్ప హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉన్నా.. ఆయన్ను ఈసారి మంత్రి పదవి వరించలేదు.


చిన రాజప్పకు మంత్రి పదవి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది ఆయన సామాజిక వర్గమే అని చెప్పక తప్పదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. కాపు సామాజిక వర్గం నుంచి పార్టీకి మొదటి నుంచి ఆర్థికంగా అండదండలు అందిస్తున్న నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పొంగూరు నారాయణకు మంత్రి పదవి ఇవ్వడం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.


ఇక పవన్‌ కల్యాణ్‌ ఎలాగూ కాపు సామాజిక వర్గం నుంచి ఉండనే ఉన్నారు. అందులోనూ పిఠాపురం కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. రెండు పక్క పక్క నియోజక వర్గాల నుంచి మంత్రి పదవులు ఇవ్వడం కూడా చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. పవన్‌ కల్యాణ్‌కు ఎలాగూ ఇవ్వక తప్పనిసరి పరిస్థితి. ఇక ఇదే సామాజిక వర్గం నుంచి కొత్త వారిని ప్రోత్సహించాలని నిమ్మల రామానాయుడు వంటి వారికి చంద్రబాబు మంత్రిపదవి కట్టబెట్టారు. ఇలాంటి సమీకరణాల కారణంగా ఈసారి నిమ్మకాయల చినరాజప్పకు మంత్రి పదవి మిస్‌ అయింది. కొంత కాలంగా చిన రాజప్ప ఆరోగ్యం కూడా అంతగా సహకరించడంలేదు. ఆయన్ను పక్కకు పెట్టడానికి అది కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: