ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం భారీ ఓటమి చవి చూసిన వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఫలితాలపై తీవ్ర విషాదంగా స్పందించిన జగన్ సైతం తేరుకొని.. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.  తొలుత సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. తాజాగా  ఆ పార్టీ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలతోను సమావేశం అయి వారికి దిశా నిర్దేశం చేశారు.


రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది సభ్యుల బలం ఉంది. లోక్ సభలో కూడా నలుగురు ఎంపీలు ఉన్నారు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో వైసీపీ మద్దతు కీలకం కానుంది. పార్లమెంట్ లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అంశాల వారీగానే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.   పార్టీ విధివిధానాల ప్రకారం ముందుకు సాగాలని సూచించారు.


ఇంత వరకు బాగానే ఉన్నా అంశాల  వారీగా మద్దతు బీజేపీకే ఇస్తారు అని పలువురు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. తమ ప్రత్యర్థి, తమ ఓటమికి కృషి చేసినా కూడా బీజేపీని దూరం పెట్టకూడదని జగన్ భావిస్తున్నారు. గతంలో కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అని ఎన్డీయే పెట్టిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇదే పునరావృతం అవుతుందని జోస్యం చెబుతున్నారు.


దేశంలో ఎక్కడా లేని రాజకీయాలు ఏపీలో జరుగుతున్నాయని.. తమ ప్రత్యర్థి వేరే కూటమిలో ఉన్నా అదే కూటమికి మద్దతు ఇస్తే ఇక అందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.  పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.  ఏదైనా తేడా జరిగితే రేపు జగన్ జైలుకెళ్లడం ఖాయం. ఆయన ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీతో కోరి తగవు తెచ్చుకోవడం ఎందుకు అని జగన్ భావిస్తున్నారు. అందువల్ల అంశాల వారీ మద్దతు అని పేరు చెప్పి బీజేపీకి సపోర్ట్ చేయాలని వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: