ఏపీలో పంచాయ‌తీ, మునిసిపాలిటీ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. `అంత‌కుమించిన ఫ‌లితాలే` వ‌స్తాయం టూ టీడీపీ నేతృత్వంలోని కూట‌మి పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా తెలంగాణ‌లో ముని సిప‌ల్ ఎన్నిక‌లు ముగిశాయి. 116 మునిసిపాలిటీల‌లో 66 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆర్ ఎస్‌కు కేవ‌లం 13 చోట్ల మాత్ర‌మే నేరుగా విజ‌యం ల‌భించింది. ఈ ప‌రిణామాలు.. ఏపీలో చ‌ర్చ‌కు దారితీశాయి.


ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీకి వ‌చ్చిన కూట‌మి ఎమ్మెల్యేలు.. బ‌డ్జెట్ ప్ర‌సంగం అనంత రం.. లాబీల్లో మీడియా మిత్రుల‌తో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ మునిసిప‌ల్ ఎన్నిక‌లు.. అధికార పార్టీ కాంగ్రెస్ సాధించిన విజ‌యం.. అదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ ప‌నితీరు వంటివి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. దీనిపై ప‌లువురు ఎమ్మెల్యేలు త‌మ‌దైన శైలిలో విశ్లేషించారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే.. కూట‌మి క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చ‌ర్యంలేద‌ని కొంద‌రు వ్యాఖ్యానించారు.


మ‌రికొంద‌రు మాత్రం తెలంగాణ‌లో వ‌చ్చిన ఫ‌లితం కంటే కూడా.. అంత‌కుమించిన స్థాయిలోనే ఏపీలో ఫ‌లితం వ‌స్తుంద‌న్నారు. ఇక‌, తెలంగాణ‌లో 36 మునిసిపాలిటీల‌లో హంగ్ ఏర్ప‌డ‌డంపై కూట‌మి ఎమ్మెల్యే లు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు. అక్క‌డి ప్ర‌జ‌లు ఏ పార్టీనీ విశ్వ‌సించ‌డం లేద‌న్నారు. అందుకే.. 36 చోట్ల హంగ్ ఏర్ప‌డింద‌న్నారు. కానీ, ఏపీలో అలాంటి ప‌రిస్థితి రాబోద‌ని.. కూట‌మి పార్టీల‌పై ప్ర‌జ‌లకు అత్యంత విశ్వ‌స‌నీయ‌త ఉంద‌ని వ్యాఖ్యానించారు.


పైగా.. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం లేద‌ని కొంద‌రు చెప్పారు. వైసీపీ  ఉన్నా.. ర‌ప్పా-ర‌ప్పాపార్టీగా ముద్ర ప‌డి న నేప‌థ్యంలో ఆ పార్టీ అంటేనే ఇప్పుడు ప్ర‌జ‌లు ఛీత్క‌రించుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ముఖ్యంగా తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌ని.. చంద్ర‌బాబును దూషించిన వ్య‌వ‌హారం పైనా అలానే ఉన్నార‌ని తెలిపారు. ఎలా చూసుకున్నా.. వైసీపీకి ఒక్క శాతం కూడా సానుకూల‌త ల‌భించ డం లేద‌ని కూట‌మి ఎమ్మెల్యేలు అభిప్రాయ‌ప‌డ్డారు. సో.. ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా కూట‌మిదే పైచేయి అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: