ఒకప్పటి మనుషుల్లో ఎక్కువగా పెద్ద వయసువారికే గుండె జబ్బులు, షుగరు, బిపి వంటివి వచ్చేవి. అయితే వారు తినే పోషకాలు కలిగిన ఆహారం, మరియు దానితో పాటు ఎప్పటికపుడు కష్టపడి పని చేయడమే వారిలో ఎక్కువమంది ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఇక ఒక ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎంతో కష్టపడి రోజంతా పని చేసి జీవించేవారు. అంతేకాక అప్పట్లో ఆహార ధాన్యాలకు ఎరువులు మరియు పురుగు మందుల వాడకం చాలావరకు తక్కువగా ఉండేది. ఇక ఎక్కువమంది సేంద్రియ, సహజమైన పద్ధతుల్లోనే వ్యవసాయం చేసి పంట పండించే వారు. ఇక రాను రాను నూతన రకాల ఆహర ఉత్పత్తి పద్ధతులు, అలానే వాటితో పాటు పలు రకాల ఎరువులు, పురుగుమందు వాడకం వంటివి ఎక్కువ అవడం జరుగుతూ వస్తోంది. ఆ విధంగా పండించిన పంట తినడం వలన మనకు అతి తక్కువ కాలంలోనే రకరకాల వ్యాధులు రావడం జరుగుతోంది. అలానే వీటితో పాటు మనం బయట తినే పలు ఆహార పదార్ధాల కల్తీ గురించి అయితే చెప్పనవసరం లేదు. 

బియ్యం, కోడిగుడ్లు, పాలు దగ్గరి నుండి దాదాపుగా ప్రతి ఒక్క ఆహార పదార్థంలో కేవలం తృచ్ఛమైన డబ్బుకోసం కల్తీ చేస్తూ పోతున్నారు. అసలే పండించే పంటలో నాణ్యత లేకుండా తింటున్న మనం, ఈ విధంగా దగ్గరుండి మరీ కల్తీ చేస్తున్న ఆహార పదార్ధాలతో మరింత త్వరగా రోగాల బారిన పడుతున్నాం. ఇప్పటికే చాలా చోట్ల నీటి కాలుష్యం, వాయు కాలుష్యం వంటి సమస్యలతో సతమతం అవుతున్న మనం, ఈ విధంగా దగ్గరుండి ఆహారాన్ని కల్తీ చేస్తుండడం వలన రోజురోజుకు మన ఆయుషుని మనమే తగ్గించుకుంటున్నాం అని ఒప్పుకోక తప్పదు. ఇటీవల ప్లాస్టిక్ బియ్యం, కెమికల్స్ కలిపి తాయారు చేసిన కృత్రిమమైన కోడిగుడ్లు, పాలు వంటి నిత్యావసరాలు కూడా కల్తీ చేస్తుండడంతో ఎందరో ప్రజలు పాలు, గుడ్లు అంటే భయపడే పరిస్థితి తలెత్తింది. 

రోజూ మనం తినే అన్నాన్ని కూడా ప్లాస్టిక్ రైస్ పేరుతో కల్తీ చేస్తున్నాం అంటే, నేటి మనిషికి డబ్బు పిచ్చి ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు కేవలం ధనార్జనే ద్యేయంగా నడుపుతున్న పలు హోటళ్లు, రెస్టారెంట్ల వంటివి కల్తీ ఆహార పదార్దాలతో మన ఆరోగ్యాన్ని మరింత ఛిద్రం చేస్తున్నాయి. మరి ఇన్ని విధాలుగా కల్తీ ఆహార పదార్ధాల బారిన పడుతున్న మనమే, చేజేతులా మన ఆయుః ప్రమాణ రేటుని తగ్గించుకుంటూ పోతున్నాం. కాబట్టి దయచేసి ఇకనైనా మన చుట్టూ ఉన్న వారు కూడా మనవంటి వారే అని తలచి, తృచ్ఛమైన డబ్బు కోసం మనం తినే ఆహారాన్ని కల్తీ చేయడం ఆపేద్దాం, మన జీవితాన్ని మనమే ధన్యం చేసుకుందాం....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: