
ఒక్కసారిగా ఎక్కువగా తినినప్పుడు ఛాతిలో మంట ఎక్కువగా అనిపించవచ్చు. అలాగే, భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు ఉన్నవారిలోనూ ఈ సమస్య తరచుగా కనిపిస్తుంది. తిన్న వెంటనే వంగడం, మసాలా, కారం, ఆయిల్ ఎక్కువగా కలిగిన ఆహారం తీసుకోవడం కూడా రిఫ్లక్స్ సమస్యకు దారి తీస్తుంది. మద్యపానం చేసే వారిలోనూ, అధిక బరువు ఉన్నవారిలోనూ ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. వీటన్నింటి వల్ల కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి వచ్చే అవకాశం పెరిగి ఛాతిలో మంట కలుగుతుంది.
ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని జీవనశైలి మార్పులు అవసరం. ఒక్కసారి ఎక్కువగా తినకుండా అల్పాహారాన్ని స్వీకరించడం మంచిది. చిన్నచిన్న భోజనాలు రోజంతా విభజించి తీసుకోవాలి. మసాలా, కారం, పుల్లటి పదార్థాలు వంటి ఆమ్లత ఎక్కువగా కలిగించే ఆహారాన్ని తగ్గించుకోవాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల విరామం తర్వాతే పడుకోవడం ఆరోగ్యానికి మంచిది. శరీర బరువు నియంత్రణ కూడా చాలా ముఖ్యం. అధిక బరువు ఉన్నవారిలో రిఫ్లక్స్ సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడం, ముఖ్యంగా వాకింగ్ లేదా యోగా లాంటి మృదువైన శారీరక చర్యలు అనుసరించడం ద్వారా ఛాతిలో మంట వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ సూచనలు పాటించినప్పటికీ సమస్య తగ్గకపోతే, గ్యాస్, మంట, గొంతునొప్పి మితిమీరినట్లైతే, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుని సంప్రదించాలి. వారు అవసరమైన పరీక్షలు చేసి, అవసరమైతే ఔషధాలతో చికిత్స సూచిస్తారు.
తిన్న తర్వాత ఛాతిలో మంట అనేది ఒక చిన్న సమస్యలా అనిపించినా, దీని వెనుక ఉండే కారణాలను తేలికగా తీసుకోకూడదు. సరైన జీవనశైలి, ఆహార నియమాలు పాటించడం ద్వారా దీనిని పూర్తిగా నియంత్రించవచ్చు. మరీ తలనొప్పిగా మారితే, వైద్యుడిని సంప్రదించడం మంచిదే.