రోజంతా నిద్రమత్తుగా, బద్ధకంగా అనిపించడం ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం, పని ఒత్తిడి లేదా ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. అయితే కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి సులభంగా బయటపడవచ్చు.

ముందుగా, రాత్రివేళ కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకోవడానికి గంట ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లకు దూరంగా ఉండటం వల్ల మెదడు ప్రశాంతత పొంది త్వరగా నిద్రపడుతుంది. ఉదయాన్నే నిద్రలేవగానే కాసేపు ఎండలో గడపడం వల్ల శరీరానికి విటమిన్ డి అందడమే కాకుండా, శరీరంలోని 'సార్కాడియన్ రిథమ్' క్రమబద్ధం అవుతుంది, దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.

ఆహారపు అలవాట్లు కూడా నిద్రమత్తుపై ప్రభావం చూపుతాయి. మధ్యాహ్నం పూట భారీ భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ కోసం శరీరం ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది, దీనివల్ల నిద్ర వస్తుంది. కాబట్టి మధ్యాహ్నం తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కూడా అలసట, నిద్రమత్తుగా అనిపిస్తుంది, కాబట్టి రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండాలి.

పని మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవడం, కుర్చీలోంచి లేచి కాసేపు అటు ఇటు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి మెదడు చురుగ్గా మారుతుంది. అలసటగా ఉన్నప్పుడు ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. కాఫీ లేదా టీలు అతిగా తాగకుండా, వాటికి బదులుగా తాజా పండ్ల రసాలు లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల సహజంగానే శక్తి పెరుగుతుంది. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అంది, రోజంతా నిద్రమత్తు రాకుండా ఉల్లాసంగా ఉండవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే మీ పనితీరు మెరుగుపడటమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిద్రమత్తు సమస్యతో బాధ పడేవాళ్ళు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: