నాలుగు సార్లు వైరాలజీ పరిశోధనల ద్వారా నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డ భారతీయ అమెరికన్ డాక్టర్ ఎం ఎస్ రెడ్డి, అభిప్రాయం ప్రకారం మన భారతీయ ఆహారపుటలవాట్లే జన్మతః ఎక్కువ రోగ నిరోధక శక్తి (ఇమ్మ్యూనిటి) ని నింపాయి.




నిజమే. లక్షల సంవత్సరాల భారతీయ సాంప్రదాయం అనేకానేక వారసత్వ లక్షణాలు సాంప్రదాయంలో ఆచారాల పేరిట నింపుకొంటూ వస్తుంది. అవే నేడు భారత్ ను ప్రత్యేకించి కరోనా ప్రభావానికి శాస్త్రీయంగా ఎంతగానో అభివృద్ధి చేందిన దేశాలు ప్రమాదంలో పడి తల్లడిల్లినంతగా ఇబ్బందుల పాలు చేయలేదు. కొంతవరకు తట్టుకునే సామర్ధ్యం మనకు మన దేహంలోనే నిగూఢమై ఉంది.




ఆయన మాటల్లో ప్రత్యేకించి చెప్పబడ్ద పులియబెట్టిన ఆహారం - “తరవాణి" చక్కని అందమైన అమ్మాయి పేరును తలపించే ఈ అమృత ఆహార తరంగిణి, తరతరాల సాంప్రదాయిక ఆహారంగా వర్దిల్లుతూ వస్తూ అనంతమైన శక్తిని కూడా ఇచ్చే ఉపాహారమిది.




మన తెలుగువారి ఆహార-ఆచార వ్యవహారాల్లో అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉంటాయి. పూర్వం ఇంటిల్లిపాదీ మూడు పూటల అన్నం తినడం అనేది మన సంస్కృతి. అన్నంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలం. వ్యవసాయ పనులు చేసుకొని జీవించే రైతు కుటుంబాలు వరి బియ్యం, జొన్న, లాంటి దాన్యంతో అన్నం వండుతారు. కార్నోహైడ్రేట్స్ జీర్ణక్రియకు గురై అధ్భుతమైన శక్తి జనిస్తుంది. దేహం సరైన రక్త ప్రసరణతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా మారిపోతుంది.




చద్దన్నంతో ఉదయ భోజనం లేదా ఉపాహారం (బ్రేక్ ఫాస్ట్) మొదలౌతుంది. ఇప్పుడంటే టిఫిన్ల సంస్కృతి పెరిగింది గానీ, ఒకప్పడు చద్దన్నమే మహాప్రసాదంగా భావించేవారు. చద్దన్నం ఉదయం ఐదు గంటలకు తినేసి. పొలాల్లో పనులు ముగించు కొని కరకరలాడే ఆకలితో మద్యాహ్నం పదకొండు -పన్నెండు గంటల కు నిండైన పదార్ధాలతో రెండవ సారి భొజనం చేయటం (ఫుల్ కోర్స్) ఆ తరవాత మళ్ళీ పొలం పనులు - మొత్తం తిన్న ఆహారం జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది (ఏసిమిలేషన్).





మనం లెక్కేసుకుని తినే కాలరీల లెక్క అక్కడ ఏ మూలకూరాదు. సంపూర్ణ జీర్ణ ప్రక్రియకు ముందు కఠిన శారీరక శ్రమ చేయటంతో కడుపులో జీర్ణ రసాలు సరిగ్గా తయారై "జఠరాగ్ని" పుడుతుంది. దీంతోనే ఆకలి మొదలౌతుంది. అప్పుడు ఆహారం తీసుకుంటే "రాళ్ళైనా కరుగుతాయి - రాళ్ళనైనా అరిగించు కుంటారు" అంటారు.




రాత్రి ఇంట్లో మిగిలిపోయిన అనాన్ని ఒక మట్టి పాత్రలోకి తీసుకొని దానిలో బాగా వేడి చేసిన పాలు కుండ నిండా పోసి గొరు వెచ్చని వేడి వరకు చల్లారనిచ్చి దానికి కొద్దిగా మజ్జిగ చేర్చి పులియ బెడతారు. దీన్నే చద్దన్నం లేదా చల్ది అన్నం అంటారు. అంటే చల్లదనం కలిగించె ఆన్నమని అర్ధం. పులవటానికి కొంత సమయమిచ్చి తరవాత "చద్దన్నం" (ఘనరూప తరవాణి) తినాలి.




రాత్రి నిద్రబోయే ముందు అన్నం వండి వార్చిన గంజిలో కొద్దిగా మజ్జిగవేసి పులియ బెడతారు (ఫెర్మాంటేషన్) ఈ పులియ బెట్టిన గంజిని "చల్ల లేదా మజ్జిగ" (ద్రవరూప తరవాణి) అంటారు. ఈ పులియ బెట్టిన గంజిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా మిరియాల పొడి, చాలా సన్నగా తరిగిన కొద్ది పచ్చి మిర్చి కలిపి సూర్యొదయ సమయములో తాగేస్తే ఆ మజాయే వేరు. చెత్త టీ, కాఫీ, బూస్ట్, కాంప్లాన్లు మొదలైన పానీయాలు “తరవాణి లాంటి అమృత పానీయం” ముందు దిగదుడుపే.




ఇలా తాయారైన చద్దికి కొంచెం ఎక్కువ గానే కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా సన్నగా తరిగిన పచ్చి మిర్చి, స్వల్పంగా మిరియాలపొడి కలిపి లాగించేటప్పుడు కొద్దిగా ఆవకాయ లెదా గోంగూర పచ్చడి నంజుకుంటే (మంచింగ్) ఆ మజాయే వేరు. చద్దన్నం, తరవాణి వలన శరీరానికి మాంచి తేజస్సు వస్తుంది. పోషక విలువలు ఎక్కువ ఉండే ఆహారం, చర్మ వ్యాదులకు చెక్ పెడుతుంది. ఆకలి చురుకు దనం పెరిగి ఉత్తేజంగా ఉంటారు మనుషులు.




ఈ రోజుల్లో రాత్రి మిగిలి పోయిన అన్నం పొద్దున్నే తినేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాత్రి అన్నం ఎంత ఉన్నా కూడా పొద్దున్నే పడేయడం కాని, పనివాళ్ళకు గాని మరె వరికైనా పెట్టడం కాని (పనివాళ్ళకు కూడా తీసుకెళ్ళని దుర్దినాలివి) చేస్తూ ఉంటారు.





అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన మన శరీరానికి అవసరమైన సహజ లవణాలు, పోషక విలువలు ఉన్నాయనే విషయం తెలుసుకుంటే, మరవకుంటే మన జీవనం అద్భుతంగా సాగుతుంది . అందుకే 'పెద్దల మాట చద్ది మూట' అనే సామెత విరివిగా ప్రచారములో ఉంది. పెద్దల మాటలో అనుభవం దాగి ఉంది. చద్ది అన్నములో మహత్తర పోషకాలు దాగి ఉన్నాయని అర్ధం.





మన తాత ముత్తాతల తరం వారు చద్దన్నం ను ఎంతో ఇష్టంగా తినడం వలన, వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. మన తాతల కాలంలో రాత్రి వండిన అన్నం పొద్దున్నే పెరుగు కలుపుకుని, మామిడి కాయ లెదా గోంగూర పచ్చడి వేసుకుని, పచ్చి మిర్చి గానీ , ఉల్లిగడ్డ గానీ నంజుకుని తింటే బాగుంటుంది.




చద్దన్నం ఆవకాయ ప్రఖ్యాతి గాంచిన బెస్ట్ కాంబినేషణ్. కాని ఇప్పుడు అలా తినేవారు కలికానికి కూడా కానరారు. పల్లెటూళ్ళ లో రాత్రి మిగిలిన అన్నాన్ని కుడితిలో కలిపి పశువులకు పెడతారు. కనీసం ఆ పోషకాలు తిరిగి పాల రూపములో మనకే దక్కుతాయి. పట్టణాలలో అలా కాదు కదా!




చద్దన్నం తినడం వల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. వేడి శరీరతత్వం ఉన్నవారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే దేహానికి మంచిది. చద్దన్నం తింటే ఎక్కువ సమయం ఉల్లాసంగా గడప గలుగుతారు, పలు చర్మ వ్యాదుల నుండి కాపాడుతుందని అంటున్నారు. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.





చద్దన్నం తినటం వలన జీర్ణక్రియ వేగవంతమై కదుపులో వాతం, గాస్ లాంటి సమస్యలు దరిచేరవు. చద్దన్నం ఒక ఇన్ష్-టాంట్ ఫుడ్ త్వరగా జీర్ణమై రక్తంలోకి అతితేలికగా చేరిపోయి (ఎసిమిలేట్) శక్తి ఉత్పన్నమౌతుంది. చద్దన్నం అంటే పులిసిన కార్బొహైడ్రేట్. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తదితర లవణాలు సహజసిద్ధంగా ఉంటాయి. అవే కావల్సినంత దేహ పుష్టిని ఇస్తాయి. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉండబట్టే, ఇప్పటికీ పల్లెటూళ్ల లో చద్దన్నం సంస్కృతి కొనసాగుతోంది



మరింత సమాచారం తెలుసుకోండి: