కాకరకాయ అనగానే చాలామంది ముఖం చాటేస్తారు. ఆ చేదు రుచి వల్ల పిల్లలే కాదు, పెద్దలు కూడా దీనిని తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ ఆరోగ్య పరంగా చూస్తే కాకరకాయ ఇచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం నుంచి, రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇంతటి మేలు చేసే కాకరకాయను చేదు లేకుండా, అందరూ ఇష్టపడేలా ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాకరకాయ కూర రుచిగా ఉండాలంటే ముందుగా వాటిని కోసే విధానంలో చిన్న మార్పు చేయాలి. కాయలను చక్రాల్లా కోసి, వాటికి తగినంత ఉప్పు, పసుపు పట్టించి ఒక గంట పాటు పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు నీరు బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ముక్కలను గట్టిగా పిండి ఆ నీటిని పారబోయాలి. ఇలా పిండడం వల్ల సగం చేదు అక్కడే తగ్గిపోతుంది. ఇక వండేటప్పుడు నూనెలో ముక్కలను దోరగా, ఎర్రగా వేయించాలి. ముక్కలు ఎంత బాగా వేగితే చేదు అంత తక్కువగా అనిపిస్తుంది.

ఈ కూరకు అసలైన రుచిని ఇచ్చేది మనం చివరలో వేసే పొడి. వేయించిన శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర మరియు ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేగుతున్న కాకరకాయ ముక్కల్లో వేసి కలపాలి. ముఖ్యంా ఇందులో కొద్దిగా బెల్లం తురుము లేదా పంచదార చేర్చితే ఆ తీపి, చేదును పూర్తిగా విరిచేసి కూరకు అదిరిపోయే రుచిని ఇస్తుంది. బెల్లం ఇష్టం లేని వారు చింతపండు రసాన్ని కూడా వాడుకోవచ్చు. పులుపు, తీపి, కారం సమపాళ్లలో ఉన్నప్పుడు కాకరకాయ చేదు అస్సలు తెలియదు.

ఒకవేళ మీరు వేపుడు కాకుండా మసాలా కూరలా చేయాలనుకుంటే, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వాడండి. ఉల్లిపాయల్లోని తీపిదనం కాకరకాయ చేదును తగ్గిస్తుంది. కూర దించే ముందు కొద్దిగా వేయించిన నువ్వుల పొడి వేస్తే ఆ రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రయత్నిస్తే కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా మళ్ళీ మళ్ళీ వండమని అడుగుతారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఇచ్చే ఈ చిట్కాలను పాటిస్తూ కాకరకాయను మీ ఆహారంలో భాగం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: