రాజకీయాల్లో సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు చెలాయించడం సాధారణమే. ఈ క్రమంలోనే తమకున్న బలంతో మరో నేతని  తొక్కేసి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సామాజికవర్గాల  పరంగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఎక్కడైనా అగ్రకులాలు  వారు, తక్కువగా ఉన్నవారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి అనుభవమే తనకు ఎదురవుతుందని విశాఖపట్నం పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసారు.

 

తాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తనపై నేటికీ వివక్ష చూపుతున్నారని, దళితుడిని అన్న కారణంగా తనను చులకనగా చూస్తూ, హేళన చేస్తూ తనను రాజకీయంగా పైకి ఎదగనివ్వడంలేదని బాబూరావు వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే సొంత పార్టీ నేతల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసారు.

 

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గినట్లే కనిపిస్తోంది. బాబూరావు నియోజకవర్గంలో బాగానే పని చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి అండతో బాబూరావు రాజకీయంగా బలపడినట్లే కనిపిస్తోంది. కాగా, బాబూరావు కాంగ్రెస్ లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 లో ఇదే పాయకరావుపేట నుంచి విజయం సాధించారు. తర్వాత జగన్ వెనుక వచ్చి కాంగ్రెస్ కు రాజీనామా చేసి, 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు.

 

ఇక 2019 ఎన్నికల్లో దాదాపు 31 వేలపైనే మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బంగారయ్యపై విజయం సాధించారు. అయితే మూడోసారి విజయం సాధించిన బాబూరావు...మొదట్లో సొంత పార్టీ నేతలతో ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత ఏమైందో గానీ బాబూరావు బహిరంగంగా అసంతృప్తి ఏమి వ్యక్తం చేయలేదు. మరి అక్కడ పరిస్థితులు సర్దుకున్నాయో లేక, బాబూరావు సైలెంట్ అయ్యారో తెలియడం లేదు.

 

ఆ విషయం పక్కనబెడితే... బాబూరావు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు బాగానే అందుతున్నాయి. ఇక స్థానిక సంస్థల విషయానికొస్తే...ప్రస్తుతానికి ఇక్కడ వైసీపీ బలంగానే ఉంది కాబట్టి, మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడటం ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో కోటవురట్ల, నక్కలపల్లె, పాయకరావుపేట, ఎస్ రాయవరం మండలాలు ఉండగా, ఈ నాలుగు చోట్ల వైసీపీ బలంగానే ఉంది.

 

ఈ నియోజకవర్గానికి టీడీపీ తరుపున వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించి, 2019 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆమెని మళ్ళీ పాయకరావుపేట ఇన్ ఛార్జ్ గా నియమించారు. ప్రస్తుతం పార్టీ కేడర్ ని సమన్వయం చేసుకునే పనిలో ఉన్నారు. అలాగే జగన్ ప్రభుత్వంపై బాగానే పోరాడుతున్నారు. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి పెద్దగా పోటీ ఇవ్వడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: