కొలుసు పార్థసారథి...కృష్ణా జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగిన సారథి, 2004 ఎన్నికల్లో కృష్ణా జిల్లా వుయ్యూరు(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో పెనమలూరు(నియోజకవర్గాల పునర్విభజన తర్వాత) కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.


అలాగే వైఎస్ కేబినెట్‌లో మంత్రి కూడా అయ్యారు. అయితే వైఎస్ మరణించాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడంతో 2014 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చేశారు. వైసీపీలోకి వచ్చాక సారథి, 2014 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


ఓడిపోయినా కూడా పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్..సారథికి మళ్ళీ పెనమలూరు టిక్కెట్ ఇచ్చారు. జగన్ వేవ్, తన సొంత బలంతో సారథి టీడీపీ అభ్యర్ధి బోడే ప్రసాద్‌పై విజయం సాధించారు. ఇక మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో సారథి మంత్రి పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కానీ తన సొంత సామాజికవర్గానికి చెందిన యువనాయకుడు అనిల్ కుమార్ యాదవ్‌కు జగన్ మంత్రి పదవి ఇచ్చారు.


పదవి రాకపోయినా సరే సారథి నియోజకవర్గంలోని దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలు బాగానే అందిస్తున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు చేరేలా చూస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు నియోజకవర్గంలో జరగడం లేదు. అటు సారథిపై అనేక అవినీతి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇళ్ల పట్టాలు, ఇసుక విషయాల్లో సారథిపై టీడీపీ నేత బోడే ప్రసాద్ గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.


బోడే ప్రసాద్ సైతం టీడీపీ తరుపున బాగానే పోరాటం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో వైసీపీ మంచి విజయాలు సాధించింది. దీంతో సారథి సత్తా తగ్గలేదని అర్ధమైంది. ఇలా సత్తా చాటుతున్న సారథికి నెక్స్ట్ టర్మ్‌లో మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ తన కేబినెట్‌లో అనిల్ కుమార్‌ని కొనసాగిస్తూనే, సారథికి ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. చూడాలి ఈసారైనా సారథి సెట్ చేసుకుంటారో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: