పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. సగంపైనే నియోజకవర్గాల్లో గెలుపోటములని కాపులే డిసైడ్ చేస్తారు. ఇక కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం ఒకటి. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీనే గెలిచింది. 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో బీజేపీ నుంచి మాణిక్యాలరావు విజయం సాధించారు. 2019 ఎన్నికలోచ్చేసరికి ఇక్కడ త్రిముఖ పోరు జరిగింది.


వైసీపీ నుంచి కొట్టు సత్యనారాయణ, టీడీపీ నుంచి ఈలి నాని, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌లు పోటీ చేశారు. ఈ ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులే. అయితే జగన్ వేవ్‌లో కొట్టు విజయం సాధించారు. టీడీపీపై 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనసేనకు 36 వేల ఓట్లు వరకు వచ్చాయి. ఇక ఎమ్మెల్యేగా కొట్టు బాగానే పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి.


అయితే ఈయనపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అప్పటిలో పలు ఆరోపణలు చేశారు. ఇసుకలో, ఇళ్ల స్థలాల్లో దోపిడి చేశారని ఆరోపించారు. అటు టీడీపీ నేతలు సైతం కొట్టు ఇసుకలో విచ్చలవిడిగా దోపిడి చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ ఆరోపణలు ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. కాకపోతే నియోజకవర్గంలో జగన్ ఇమేజ్ వల్ల వైసీపీ బలంగా ఉంది.


అటు టీడీపీలో ఓడిపోయిన ఈలి నాని, తన సొంత పనులని చక్కదిద్దుకునే క్రమంలోనే వైసీపీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని టాక్. దీని వల్ల నియోజకవర్గంలో టీడీపీ వీక్ అయింది. అది ఎమ్మెల్యేకు ప్లస్ అవుతుంది. అయితే టీడీపీని నిలబెట్టేందుకు ముళ్ళపూడి బాపిరాజు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఈయన టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా టిక్కెట్ దక్కలేదు. అయినా సరే పార్టీ కోసం కష్టపడుతున్నారు. అలాగే జనసేన నేత బొలిశెట్టి సైతం ప్రజల్లో తిరుగుతున్నారు. నెక్స్ట్ ఎలాగైనా కొట్టుకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. అందుకే ఎక్కువగా కొట్టుని టార్గెట్ చేసుకుని బొలిశెట్టి రాజకీయం చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ ఎమ్మెల్యేకు జనసేనతోనే ఎక్కువ ఇబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: