ఊర్మిళ మటోండ్కర్.. ఈ పేరు పెద్దగా తెలుసో లేదో తెలీదు కానీ .. రంగీలా అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తుందీ భామ. 90లలో కుర్రకారు మనసులను దోచుకున్న ఊర్మిళ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధం చేసుకుంది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్ సభ ఎన్నికల బరిలో నిలువబోతున్నారు.

మరో ముంబై భామ పాలిటిక్స్ లోకి ఎంటరవుతోంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందీ భామ. కుర్రకారు మనసుల్లో ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న ఊర్మిళ.. ఆ తర్వాత తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో అందాలు ఆరబోసి మైండ్ బ్లాంక్ చేసింది. అవకాశాలు తగ్గడంతో అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోంది.

అయితే ఇప్పుడు ఊర్మిళ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతోంది. అయితే సినిమాల్లో కాదు.. పాలిటిక్స్ లో..! ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి హీరో గోవిందా పోటీ చేసి విజయం సాధించారు. సునీల్ దత్ ఇక్కడి నుంచి ఐదు సార్లు గెలుపొందారు. ఈ స్థానంలో హేమాహేమీలే తలపడుతుంటారు. ప్రస్తుతం ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది. ఆ పార్టీ తరపున గోపాల్ శెట్టి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతనిపై ఊర్మిళను దించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

అయితే ఊర్మిళ కాంగ్రెస్ లో చేరడంపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. కాంగ్రెస్ పార్టీ ముంబై ఇన్ ఛార్జ్ సంజయ్ నిరుపమ్ ఊర్మిళతో ఈ విషయంపై చర్చించినట్టు సమాచారం. ఊర్మిళతో పాటు ఆమె కుటుంబసభ్యులు ప్రాథమికంగా అంగీకరించినట్టు తెలిసింది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఊర్మిళ కుటుంబసభ్యులు నిరాకరించారు. అయితే ఆమె పార్టీలో చేరడం ఖాయమని, ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: