
హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఎక్స్‌పరిమెంట్ చేస్తూనే ఉంటారు. ఆయన సినిమాలు పెద్దగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా ఏదో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు. అందం, మంచి నటన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎందుకోగాని కళ్యాణ్‌రామ్‌కి అవేమి పెద్దగా కలిసిరావడం లేదు. ఆయన మళ్లీ సాహసం చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. `అతనొక్కడే` సినిమాతో ప్రొడ్యూసర్‌గా కూడా మారిన కల్యాణ్‌రామ్ కొత్త వాళ్లతో సినిమాలు చేస్తూనే వున్నాడు. జయీభవ, కల్యాణ్‌రామ్ కత్తి, ఓమ్ 3డీ, ఇజమ్ వంటి చిత్రాల్ని నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. అయినా సరే మళ్లీ కొత్త దర్శకుడిని పరిచయం చేయడానికి మాత్రం జంకడం లేదు.
`ఎంత మంచివాడవురా` సినిమాతో ఫ్లాప్‌ని సొంతం చేసుకున్న నందమూరి కల్యాణ్‌రామ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండానే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టేశాడు. ఇక ఎంత మంచివాడురా అనే కాన్సెప్ట్ అసలు కళ్యాణ్‌రామ్ ఎలా నమ్మాడో ఎవరికి అర్ధం కాలేదు. లాజిక్ మిస్ అయ్యే కొన్ని పాయింట్స్‌ని ప్రేక్షకులు అంత త్వరగా తీసుకోరు. ఇక మల్లిడి వేణు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 13వ శతాబ్దం కాలం నాటి కథగా ఓ విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రాన్ని మల్లిడి వేణు రూపొందిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరలో ఇప్పటికే సైలెంట్‌గా సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమహల్ సెట్‌ని కూడా నిర్మించారు. ప్రస్తుతం ఈ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. రాజకుమారుడి గెటప్‌లో కల్యాణ్‌రామ్‌పై పలు కీలక ఘట్టాలని దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. మరి అయితే ఈ సినిమాతోనైనా కల్యాణ్‌రామ్ పెద్ద సాహసమే చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి ఈ సాహసమైనా తన కెరియర్‌కి ఉపయోగపడితే బావుంటుంది. ఈ సినిమాతోనైనా లక్ కలిసిరావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే కళ్యాణ్‌రామ్ చేసే ప్రతి చిత్రం కథ ముందు ఎన్టీఆర్ వింటున్నారని ఆ తర్వాత ఓకే చేస్తున్నారని వార్తలు వచ్చాయి.