సంగీత సామ్రాజ్యంలో ఒకరిని మించిన వారు ఒకరు. ఒకరు గంధర్వగాయకుడైతే.. మరొకరు దైవగాయకుడు. భారత సంగీత సామ్రాజ్యానికి అసలైన పట్టుకొమ్మలు వీళ్లిద్దరూ. కానీ వీరిమధ్య ఏర్పడిన వివాదం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఇద్దరూ దిగ్గజాలు కావడంతో సినీ ప్రముఖులు తటస్తంగా ఉంటూ ఎవరివైపు మాట్లాడేవారు కాదు. ఈ వివాదంలో బాలుదే తప్పని అనేవారూ లేకపోలేదు. అయితే వారంతా బయటకు చెప్పకపోగా.. లోలోన మాత్రం బాలు వ్యవహరశైలి కారణంగానే ఇళయరాజా అలా ప్రవర్తించాల్సి వచ్చిందని సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

అసలు కారణం అదే:
ఇంతకీ బాలు, ఇళయరాజా మధ్య వివాదానికి ప్రధాన కారణం.. ఓ సంగీత కచేరికి సంబంధించి ఎస్పీబీ చెప్పిన రేటు అని తెలుస్తోంది. 2016లో ఇళయరాజా అమెరికా వేదికగా భారీగా కచేరిలు ప్లాన్ చేశారు. ఇదే క్రమంలో ఆర్గనైజర్లు బాలు కూడా కచేరిలో పాడితే బాగుంటుందని అనుకున్నారు. ఈ క్రమంలోనే బాలును సంప్రదించగా.. ఆయన భారీ రేటు చెప్పారట. దీంతో నిర్వాహకులకు దిమ్మతిరిగిందట.. ఇళయరాజా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో తీసుకున్న మొత్తానికి కూడా అది ఎక్కువేనట. దాంతో ఇళయరాజా బాలును మళ్లీ సంప్రదించలేదట. రేటుపై బేరసారాలాడటం ఇష్టం లేక కొత్త గాయకులతోనే కచేరీ నిర్వహించేశారట.

అయితే ఆ తర్వాత ఈటీవీ షోలతో బిజీగా మారిన బాలు..  తన కుమారుడు చరణ్‌తో కలిసి విదేశాల్లో ఎస్పీబీ50 పేరుతో కచేరీలు నిర్వహించేందుకు రెడీ అయ్యారట. ఈ విషయం ఇళయరాజాకు తెలియడంతో బాలుకు లీగల్ నోటీసులు పంపారట. గతేడాది బాలు తన కచేరి కోసం భారీగా డిమాండ్ చేసిన విషయం మనసులో పెట్టుకున్న ఇళయరాజా.. బాలు కచేరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ తన పాటలు పాడటానికి వీలు లేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఇళయరాజా, బాలు మధ్య వివాదానికి తెరలేచింది.

ఇళయరాజా పంపిన నోటీసులపై బాలు ఆ తర్వాత స్పందించారు. ఈ విషయంపై నేరుగా తనతో మాట్లాడితే ఇంతవరకు రాకపోయేదని, అయితే ఆయన లీగల్ నోటీసులు పంపించారు కనుక తాను కూడా ఇళయరాజాకు లీగల్‌గానే సమాధానం చెప్తానని బాలు చెప్పారు. అయితే ఈ వివాదాన్ని ఎవరూ పెద్దది చేయవద్దని, స్నేహితులు, సంగీత ప్రియులు, ముఖ్యంగా మీడియా దీనిపై ఎలాంటి రూమర్లూ ప్రచారం చేయవద్దని కోరారు. అయితే తమ ఇద్దరి మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని బాలు అప్పట్లో అన్నారు.

అలా వివాదం సర్దుమణిగింది:
2018లో కేంద్ర ప్రభుత్వం ఇళయరాజాకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కమల్, రజనీకాంత్ నుంచి తెలుగు సినీ ప్రముఖులు ఇళయరాజాకు అభినందనలు తెలిపారు. వీరితో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇళయరాజాకు పద్మవిభూషణ్ దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. తన ఫేస్‌బుక్‌లో దీనిపై ప్రత్యేక పోస్ట్ చేశారు. ‘గౌరవప్రదమైన రిపబ్లిక్ డేని అందరం సెలబ్రేట్ చేసుకుందాం... జై భారత్.. పద్మా అవార్డులకు ఎంపికైన అందరికి శుభాభినందనలు. శ్రీ ఇళయరాజాకు చేరడం వల్ల పద్మా విభూషణ్ అవార్డుకే గౌరవం లభించింది’ అంటూ ప్రత్యేకంగా ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం సర్దుమణిగింది. అనంతరం అనేక సంగీత కార్యక్రమాల్లో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించి అభిమానులకు తీపికబురందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: