
ఈ చిత్ర నిర్మాణానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆర్థిక కారణాల వల్ల సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయినా నిరాశ పడకుండా, వెనక్కి తగ్గకుండా ఐదేళ్లు అలుపెరుగని యోధుడిలా పోరాడారు. చివరికి అనుకున్నది సాధించారు. 1963 మార్చి 29న విడుదల అయిన ‘లవకుశ’ చిత్రానికి నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనం బళ్ళు కట్టుకుని వచ్చి మరీ ఈ సినిమా చూశారు. బెజవాడ లోని మారుతీ టాకీస్‌లో ‘లవకుశ విడుదల అయింది. కృష్ణా జిల్లా అంతా తరలి వచ్చి మారుతీ టాకీస్‌లో ఈ సినిమా చూసింది.
హైదారాబాద్‌లో బసంతి, నటరాజ్ టాకీస్‌లో లవకుశ రిలీజ్ అయింది. ఆ రోజుల్లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతం ఓ తిరునాళ్ళలా ఉండేది. అప్పట్లో ఉదయం ఆటలు లేవు. రోజుకు మూడు ఆటలు మాత్రమే ప్రదర్శించేవారు. అందుకే మ్యాట్నికి టిక్కెట్లు దొరకక పోతే, క్లాక్ టవర్ పార్క్‌లో పడుకొని ఫస్ట్ షో చూసి వెళ్ళేవారు జనం. విడుదల అయిన అన్ని చోట్లా ఘన విజయం సాధించి, 62 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. 18 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. ఆ రోజుల్లో 60 వారాలు ఆడిన ఘనత లవకుశ కు దక్కుతుంది. కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా ఇదే!