కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. రాహుల్‌తో కలిసి పూనమ్ కూడా కొద్ది దూరం నడిచారట..


చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీతో మాట్లాడినట్టుగా పూనమ్ కౌర్ చెప్పారు. రాహుల్ గాంధీ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని అన్నారు. చేనేత సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని రాహుల్‌ను కోరానని చెప్పారు. అయితే పూనమ్ కౌర్ పాదయాత్ర లో పాల్గొన్న సమయంలో రాహుల్ ఆమె చేయిపట్టుకున్న ఫొటోపై కొందరు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు.

ఈ ఫొటోను షేర్ చేసిన బీజేపీ నాయకురాలు ప్రీతి గాంధీ.. రాహుల్ తన ముత్తాత అడుగుజాడలను అనుసరిస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే దీనిపై స్పందించిన పూనమ్ కౌర్‌.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టుగా ఉందని ప్రీతి గాంధీ కామెంట్ కు రిప్లై ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం నారీశక్తి గురించి మాట్లాడారని గుర్తుంచుకోవాలని సూచించారు. తాను బ్యాలెన్స్ తప్పి కింద పడుతున్నపుడు రాహుల్ గాంధీ తన చెయ్యి పట్టుకున్నారని పూనమ్ స్పష్టం చేశారు.

మరోవైపు పలువురు కాంగ్రెస్‌ నాయకులు కూడా ఈ ట్రోలింగ్‌కు కౌంటర్ ఇచ్చారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ సైతం ప్రీతి గాంధీ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''దేశాన్ని బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్లడానికి స్త్రీలు పురుషులతో భుజం భుజం కలిపి, చేయి చేయి కలిపి నడవడానికి దారితీస్తుందని మీరు అనుకుంటే.. భారతదేశం గురించి పండిట్ నెహ్రూ దృష్టి మాత్రమే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్, స్వాతంత్ర్య సమరయోధుల సమానత్వ భారతదేశం కల కూడా సాకారం అవుతుంది'' అని ప్రియాంక చతుర్వేదీ కామెంట్ చేశారు.

జైరామ్ రమేష్ ప్రీతి గాంధీని ''వికృతమైన, జబ్బుపడిన మనస్సు'' అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ నిజంగా తన తాత అడుగుజాడల్లో నడుస్తున్నారని, దేశాన్ని ఏకం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే అన్నారు. ''మీకు చికిత్స అవసరం, మీ మానసిక స్థితి మీ కుటుంబం, స్నేహితులకు హానికరం అని నిరూపించవచ్చు'' కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కామెంట్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: