సీనియర్ నటి రాధిక  ఒక ఫైర్ బ్రాండ్. ఆమె ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినిమా, టెలివిజన్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన రాధికకు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, పెద్దలందరితో మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి, రాధిక మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. అయితే, నందమూరి బాలకృష్ణకు సైతం రాధిక చాలా క్లోజ్. చెన్నైలో ఉన్నప్పుడు బాలకృష్ణ మీద రాధిక ఈగ కూడా వాలనిచ్చేవారు కాదట. ఈ విషయాన్ని బాలయ్య స్వయంగా ‘అన్‌స్టాపబుల్’ షోలో వెల్లడించారు.

బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 2 నాలుగో ఎపిసోడ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేతిరెడ్డి సురేష్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. వారితో ముచ్చటించి.. వేదికపై క్రికెట్ ఆడుతున్న క్రమంలో రాధిక సడెన్ ఎంట్రీ ఇచ్చారు. అంపైర్ లేకుండా గేమ్ ఏంటి అంటూ బాలయ్యను కాసేపు ఆటపట్టించారు. ఆ తరవాత ముగ్గురునూ కూర్చోబెట్టి ప్రశ్నలు వేశారు బాలయ్య. ఈ క్రమంలో రాధికతో కలిసి నటించిన స్టార్ హీరోలపై ఆమె అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
‘‘కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి.. వీళ్లందరితో చేశావుగా.. నాలాంటి సూపర్ స్టార్‌తో నీకు ఛాన్స్ రాలేదు’’ అని సరదాగా పంచ్ వేశారు బాలయ్య. రజినీకాంత్‌లో నీకు నచ్చనిదేంటి..? అని బాలయ్య అడిగిన ప్రశ్నకు రాధిక స్పందిస్తూ.. ‘‘ఆయన పనిలో ఆయన ఉంటారు. కార్నర్‌లో ఎక్కడో కూర్చుంటారు’’ అని అన్నారు. వెంటనే బాలయ్య.. రజినీకాంత్‌తో బోరింగ్ అంటావు అంతేనా అని అడిగారు. రాధిక కూడా అవును అన్నారు.

ఇక కమల్ హాసన్ గురించి మాట్లాడుతూ.. వృత్తి మీద ఆయనకున్న ఏకాగ్రత అద్భుతమని రాధిక చెప్పారు. అమితాబ్ బచ్చన్ రియల్ జెంటిల్‌మేన్ అని అన్నారు. ఇక ఆఖరిగా రాధికను ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేశారు బాలకృష్ణ. ‘చిరంజీవిలో నీకు నచ్చనిదేంటి.. నాలో నీకు నచ్చినదేంటి?’ అని అడిగారు. దీనికి కూడా రాధిక సమాధానం చెప్పారు. ‘‘చిరంజీవితో ఎప్పుడూ గొడవే. నీతో అలాంటి ఫైట్లు ఏమీ ఉండవు. ఏంటో తెలీదు కానీ.. ఏంటే నువ్వు ఎక్కువగా మాట్లాడతావు అంటారు చిరంజీవి. నువ్వు మాత్రం ఏంటి అని నేను అంటాను. మా ఇద్దరి మధ్య కొంత వాదన జరుగుతుంది. సరదా ఉండదు. మధ్యలో ఆయన భార్య సురేఖ ఒక అంపైర్’’ అని రాధిక చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: