సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లు, క్షణ క్షణానికి ట్విస్టులు ఉండే సినిమాలను ఇష్టపడే ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటారు. అలాంటి జానర్లోనే హసీనా అనే మూవీ వచ్చింది. ఇందులో ప్రియాంక డెయ్, థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్ ఇలా అందరూ నూతన నటీనటులుగా తెరకు పరిచయం అయ్యారు. తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించగా.. నవీన్ ఇరగాని దర్శకత్వం వహించాడు. మరి హసీనా మూవీతో వీరంతా తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారా? లేదా? అన్నది చూద్దాం.


కథ
అభి (అభినవ్) స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంటాడు. అతనికి సీఐ అండ కూడా ఉంటుంది. అడ్డొచ్చిన వారిని హత్య చేసుకుంటూ వెళ్తాడు. అలాంటి అభికి ఓ సారి ఏసీపీతో గొడవ జరుగుతుంది. మరో వైపు ఓ ఐదుగురు హసీనా (ప్రియాంక డెయ్), థన్వీర్ (థన్వీర్ ఎండీ), సాయి (సాయి తేజ గంజి), శివ (శివ గంగా), ఆకాష్ (ఆకాష్ లాల్) అనాథలుంటారు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఉంటారు. అనాథలైనా కూడా కష్టపడి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. హసీనా వల్ల ఈ నలుగురు జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి? అభికి వీరితో ఉన్న లింక్ ఏంటి? అసలు హసీనా చివరకు ఏం చేసింది? అభికి అండగా ఉండే సీఐ చివరకు ఏం అవుతాడు? అభిని పట్టుకోవాలనుకున్న ఏసీపీ చివరకు చేస్తాడు? అసలు ఆ ఐదుగురు స్నేహితులు చివరకు ఏం చేస్తారు? అనేది కథ.  

నటీనటులు
హసీనా సినిమాలో నటీనటులంతా కూడా ఆడియెన్స్‌ను మెప్పిస్తారు. టైటిల్ రోల్ చేసిన ప్రియాంకతో పాటుగా.. థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, అభినవ్ ఇలా అందరూ మెప్పిస్తారు. ఒక్కో పాత్రతో ఒక్కో రకమైన ఎమోషన్‌ను పండించారు. విలనిజం, కామెడీ, యాక్షన్ ఇలా అన్నింట్లోనూ కొత్త నటీనటులు మెప్పించారు. సీఐ, ఏసీపీ పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి. ఇక గీతా సింగ్ పాత్ర తక్కువే అయినా కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

విశ్లేషణ
ప్రస్తుతం సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయి.. అకౌంట్లోంచి డబ్బులు ఎలా మిస్ అవుతుంటాయి.. ఫోన్లు ఎలా హ్యాక్ చేస్తారు.. అనే వాటి మీద కూడా దర్శకుడు నవీన్ ఇందులో ఫోకస్ పెట్టాడు. స్నేహితులు అంటే ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదని కూడా అంతర్లీనంగా చర్చించినట్టుగా అనిపిస్తుంది. ప్రథమార్థం కాస్త సో సోగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.

ఇక సెకండాఫ్‌లో కథ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. నిమిష నిమిషానికి ఓ ట్విస్ట్ వస్తుంటుంది. కొన్ని ట్విస్టులు ప్రేక్షకుల ఊహకు అందేలా ఉంటాయి. ఇంకొన్ని ట్విస్టులు చూసి ఆడియెన్స్ నోరెళ్లబెట్టేస్తుంటారు. అలా సినిమా చివరి షాట్ వరకూ ఏదో ఒక ట్విస్ట్‌ను మెయింటైన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది.

హసీనా సినిమా సాంకేతికంగా ఓకే అనిపిస్తుంది. పాటలు, ఆర్ఆర్ పర్వాలేదనిపిస్తాయి. అక్కడక్కడా మాటలు మెప్పిస్తాయి. రెండు గంటలే నిడివి పెట్టి ఎడిటర్‌ ఈ సినిమాను బాగానే ఎడిట్ చేశాడు. సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ 2.75

మరింత సమాచారం తెలుసుకోండి: