సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్స్, ఆయన డైలాగ్స్‌కి ఫిదా కాని వారు ఎవరూ ఉండరు. ఆయన నడిచినా..కాలర్ ఎగురవేసినా..కూర్చున్నా..సిగరేట్ కాల్చినా ప్రతిదీ స్టైల్ గా చూపిస్తుంటారు. ఒక పంచ్ డైలాగ్స్ రజినీ నోట వింటే థియేటర్లలో విజిల్స్, చప్పట్టతో మారుమోగుతాయి. మేనరిజంతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తలైవర్ ‘2.0’సినిమాతో దుమ్మురేపుతున్నాడు. శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానులు ఆశలు పెంచుకున్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పేటా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అందాల తార సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తమిళ యువ దర్శకులలో కార్తీక్ సుబ్బరాజ్ కి మంచి క్రేజ్ వుంది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుని, వాటిని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. 2019 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి సాంగ్‌ని డిసెంబర్ 3 సాయంత్రం 6గం.లకి విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని రజనీకాంత్ స్టైలిష్ పోస్టర్ విడుదల చేస్తూ ప్రకటించారు. పోస్టర్లో రజనీని చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భాషా గెటప్‌లో రజనీకాంత్ ఉన్నారని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కళానిధి మారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి,నవాజుద్దీన్ సిద్ధిఖీ,బాబీ సింహా ముఖ్యమైన పాత్రలను పోషించారు. సంక్రాంతి కానుకగా, జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజున విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం 2.0 చిత్ర హిట్ కావడంతో రజినీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు .