నిష్ఠూరంగా ఉండే నిజాన్ని ధైర్యంగా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే సినీ పెద్దమనిషి టాలీవుడ్ సీనియర్ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతోంది. సైరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సీఎం జగన్‌తో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన చిరంజీవిపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆయనకు వైసీపీ రాజ్యసభ సీటు ఇవ్వనుందని... దాసరి స్థానం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారనే పుకార్లు పుట్టాయి.దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఈ వార్తలు వింటుంటే... తనకు కామెడీ అనిపిసోందని ఆయన కామెంట్ చేశారు.


ప్రముఖుల వద్దకు వెళ్లి తన తాజా చిత్రమైన సైరాను చిరు చూపించటం వెనుక స్వర్గీయ దాసరి ప్లేస్ ను రీప్లేస్ చేసేందుకు అంటూ వినిపిస్తున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదన్నారు. చిరంజీవి అనుకోవాలే కానీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఏ ప్లేస్ పెద్దది కాదని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ఏమైనా చేయాలనుకుంటే చిరంజీవే నేరుగా చేయొచ్చు. దానికి జగన్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు దాసరి పొజిషన్ అధికారిక పదవి ఎంతమాత్రం కాదని... ఆయన పెద్దమనిషిగా వ్యవహరించేవారని అన్నారు.

‘మా’’కు సంబంధించి గతంలో కలుగజేసుకోవాలని చెబితే.. ఒక ఇష్యూలో ఇన్ వాల్వ్ అయి చిరంజీవి ఆ ఇష్యూను సెటిల్ చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. అలాంటి చిరంజీవి ఏదో పదవి కోసం సీఎం జగన్ దగ్గరకు వెళ్లారని అనడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తమ్మారెడ్డి అన్నారు. అసలు వీళ్లకు తెలిసి మాట్లాడతారో.. తెలీక మాట్లాడతారో.. వీరిదెంత అమాయకత్వం అంటూ ఎటకారం ఆడేస్తూ చిరు పేరుతో ఏదో ఒకటి చెప్పేస్తే తమకేదో వస్తుందని అనుకోవటానికి మించిన మూర్ఖత్వం ఏముంటుందంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

మరో విషయం గంటాను జగన్ పార్టీలోకి తీసుకెళ్లేందుకు చిరు మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆ ఇష్యూ మీదా తన ఆలోచనను చెప్పేశారు. గంటా కావాలనుకుంటే ఏ పార్టీలోకైనా వెళ్లగలడు. అతనికి ఆ సామర్థ్యం.. డబ్బు ఉంది. అలాంటప్పుడు గంటాను చిరు తీసుకెళ్లి వేరే పార్టీలో చేర్పించాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి విషయానికి చిరును ఏదోలా లాగటం ఏమిటి? సోషల్ మీడియాను పిచ్చి పిచ్చి వాటికి వాడేయటం ఏమిటంటూ తనదైన స్టైల్లో చిరాకు పడ్డారు తమ్మారెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి: