తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. కమర్షియల్ హంగులు లేకున్నా ఘనవిజయం సాధించి శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం 2020 ఫిబ్రవరి 2నాటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంటుంది.  శాస్ర్తియ సంగీతానికి ఆదరణ తగ్గిపోతున్న సమయంలో ఈ సినిమా ప్రజల్లో చైతన్యమైంది. ఈ సినిమా తరువాత పుట్టిన పిల్లలందరూ సంగీత తరంగాలలో ఓలలాడేలా ముద్రవేసింది కె.విశ్వనాథ్ రూపొందించిన ఈ చిత్రం. చలనచిత్ర పరిశ్రమలో ఒక కళాత్మక దృశ్యకావ్యంగా గుర్తుండిపోయే ఈ చిత్రాన్ని పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం‌పై ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు దీన్ని నిర్మించారు. 


 
ఈ సినిమాకి కె.వి. మహదేవన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. జంధ్యాల మాటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం పాటలు, జేవీ సోమయాజులు, మంజుభార్గవి, బేబీ తులసి, అల్లు రామలింగయ్యల నటన… వెరసి శంకరాభరణం అనే ఒక అద్భుత కళాఖండం తెలుగు ప్రేక్షకుల చేత నీరాజనాలందుకుంది. ఇక ఈ సినిమాకు ప‌నిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవం తీసుకువచ్చింది. మ‌రో విష‌యం ఏంటంటే.. అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్‌లో విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇదే. అలాగే ప్రపంచ నలుమూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. 

 

ఇక అవార్డుల విషయానికి వస్తే, జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా స్వర్ణకమలం అందుకుంది. తెలుగులో స్వర్ణకమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపథ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించిన సినిమా ఇది. అలాగే ఆంధ్ర‌ప్రదేశ్ నంది అవార్డులతోపాటు, దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: