
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సోలో హీరోగా హిట్ అందుకుని చాలా కాలమే అయిపోయింది. ప్రస్తుతం నాగార్జున వందో చిత్రం ముంగిట నిలిచారు. ఈ సినిమా బాధ్యతను ఏ డైరెక్టర్ కు అప్పగిస్తారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వందో సినిమాతో ఎలాగైనా బిగ్ హిట్ అందుకోవాలని ఆశపడుతున్న నాగ్.. డైరెక్టర్ విషయంలో ఒక నిర్ణయానికి రావడానికి బాగా టైమ్ తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఈయన 100వ సినిమా లిస్టులో రోజుకొక డైరెక్టర్ పేరు వినిపిస్తోంది.
మొదట ` గార్డ్ ఫాదర్ ` ఫేమ్ మోహన్ రాజా డైరెక్షన్ లో నాగార్జున 100 సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. నాగార్జున, అఖిల్ ప్రధాన పాత్రల్లో ఆయనొక సబ్జెక్టు రెడీ చేసుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత నవీన్ అనే మరో తమిళ దర్శకుడు పేరు తెరపైకి వచ్చింది. నాగ్ తో నవీన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వీరి సినిమా ఓకే అని అందరూ అనుకున్నారు. చివరకు నవీన్ కూడా సైడ్ అయ్యారు. ఇక ఇప్పుడు నాగ్ 100వ సినిమా డైరెక్టర్ గా ఆర్ఏ కార్తీక్ పేరు వినిపిస్తోంది. ఈయన కూడా తమిళ దర్శకుడే. 2022లో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ ` నితమ్ ఒరు వానం ` అనే సినిమా ద్వారా కార్తీక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
తమిళంలో మంచి విజయం సాధించిన ` నితమ్ ఒరు వానం ` సినిమాను తెలుగులో ` ఆకాశం ` పేరుతో విడుదల చేశారు. కానీ ఈ చిత్రం ఇక్కడి ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. కార్తీక్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా బడ్జెట్ తో ఓ స్టోరీ సిద్ధం చేశాడట. ఇటీవల నాగార్జునకు ఆ కథ వినిపించగా.. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందని బలంగా టాక్ వినిపిస్తోంది. ఆల్మోస్ట్ వీరిద్దరి ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయినట్లే అని కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే కార్తీక్ కు ఒక సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉంది. అటువంటి దర్శకుడికి నాగ్ 100వ సినిమా బాధ్యతను అప్పగించినట్లు వార్తలు రావడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా తెలుగులో ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ నాగ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కు తమిళ దర్శకుల పేర్లే వినిపిస్తున్నాయి. దాంతో ఆయనకు తెలుగు దర్శకులు నచ్చట్లేదా? లేక దొరకట్లేదా? అన్న చర్చ కూడా నడుస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు