
అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు వెంకటేష్. యాక్టింగ్ పై ఆసక్తి లేనప్పటికీ తండ్రి బలవంతం తోనే వెంకీ 1986లో `కలియుగ పాండవులు` సినిమాతో నటుడిగా మారారు. తొలి ప్రయత్నం లోనే సక్సెస్ చూసిన వెంకీ.. ఆ తర్వాత మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో యాక్ట్ చేసి విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అనతి కాలంలోనే స్టార్ హీరోల చెంత చోటు దక్కించుకున్నారు. వివాదరహితుడిగా, అందరి హీరోల అభిమానులకు నచ్చే వెంకీమామగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
వెంకీ కన్నా ముందు నిర్మాతల కొడుకులు సక్సెస్ అయ్యింది లేదు. ఆ సెంటిమెంట్ ను వెంకీనే మొదట బ్రేక్ చేశారు. మళ్లీ ఆయన తర్వాత ఏ నిర్మాత కొడుకు సక్సెస్ అవ్వలేదు. చాలా ఏళ్లకు బన్నీతో మళ్లీ ఆ బ్యాడ్ సెంటిమెంట్ అనేది బ్రేక్ అయింది. ప్రముఖ నిర్మాత అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన బన్నీ.. అంచెలంచెలుగా ఎదిగాడు. తనదైన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో టాలీవుడ్ టాప్ హీరోల చెంత చేరాడు. ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు.