ఆర్థిక మందగమనం... ఇపుడు ప్రపంచ దేశాలను కుదిపేస్తోన్న అతి పెద్ద సమస్యగా మారింది. పాకిస్థాన్ నుండి అమెరికా వరకు వివిధ దేశాలు ఆర్థిక మందగమనంతో పోరాడుతున్నాయి. తాజాగా ఆ లిస్టులో చేరిపోయింది సింగపూర్. అవును, రాబోయే కొన్ని నెలల్లో సింగపూర్‌లో ఆర్థిక మాంద్యం పెరగవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతవారం అక్కడ బలహీనమైన ఆర్థిక నివేదిక మాంద్యం భయాలను పెంచింది. ఎగుమతి సంఖ్యలు వరుసగా ఎనిమిదో నెలలో క్షించడంతో విషయం కాస్త బయటకు పొక్కింది. ఈ క్రమంలో మొత్తం ఉపాధి కూడా నెమ్మదిగా క్షీణిస్తోంది. ఇటీవల తొలగింపులు కూడా భారీగా పెరిగాయి.

సింగపూర్ వాణిజ్యం, ఎంటర్‌ప్రైజ్ ప్రకారం.. మేలో చమురుయేతర దేశీయ ఎగుమతులు 14.7 శాతం మేర క్షీణించాయని తెలుస్తోంది. అదేవిధంగా ఏప్రిల్‌ నెలలో ఎలక్ట్రానిక్స్, నాన్-ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 9.8 శాతం క్షీణించాయి. మలేషియా, హాంకాంగ్, తైవాన్ మార్కెట్లలో ఈ బలహీనత ఉన్నప్పటికీ చైనా, యూఎస్‌లకు ఎగుమతులు పెరగడం గమనార్హం. మొత్తంగా చూసుకుంటే గత నెలలో సింగపూర్‌లోని టాప్ 10 షేర్లలో NODX క్షీణించింది. బ్లూమ్‌బెర్గ్ పోల్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేసిన సగటు 7.7 శాతం క్షీణత కంటే 14.7 శాతం తిరోగమనం చాలా అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే, సింగపూర్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మొదటి త్రైమాసికం విషయానికొస్తే 0.4 శాతం మేర క్షీణించింది. ఆర్థికవేత్త చువా హక్ బిన్ తాజాగా మాట్లాడుతూ.. ఎగుమతుల క్షీణత తీవ్రరూపం దాల్చుతోందని, సింగపూర్ సాంకేతిక మాంద్యంలోకి జారిపోయే అవకాశం మెండుగా ఉందని మే నెలకి సంబందించిన డేటా చెబుతోందని అన్నారు. సింగపూర్ మానవ వనరుల మంత్రిత్వ శాఖ 2023కి తన మొదటి త్రైమాసిక లేబర్ మార్కెట్ నివేదికను విడుదల చేయగా, ఒక సంవత్సరం క్రితంతో పోలిస్తే ఉద్యోగ ఖాళీలు 126,000 తగ్గాయని తెలుస్తోంది. తొలగింపులు కూడా వేగవంతం అయ్యాయి. 2022 4వ త్రైమాసికంలో 2,990 మందితో పోలిస్తే మొదటి త్రైమాసికంలో 3,820 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri