రాష్ట్ర రాజకీయాల్లో కూటమి శక్తిని మరింత పటిష్టం చేయడానికి జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కీలక వ్యూహాలను అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసి, ఆ ఓటు బ్యాంకును వైసీపీ వైపు వెళ్లకుండా అడ్డుకోవడం జనసేన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చెల్లా చెదురుగా కాకుండా కూటమి వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే ధోరణిని కాపు ఓటు బ్యాంకు విషయంలో అనుసరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం జనసేన వ్యూహాల్లో కేంద్ర బిందువుగా మారింది. అక్కడ ఆయన శాశ్వత నివాసాన్ని నిర్మించుకోవడం, తరచూ పర్యటనలు చేయడం, గ్రామాల అభివృద్ధి పనులకు ప్రత్యక్షంగా పూనుకోవడం, పిఠాపురం గ్రామీణ ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలు వేగంగా జరుగుతుండటం కూడా జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న పరిణామాలుగానే విశ్లేష‌కులు భావిస్తున్నారు.


కానీ జనసేన వ్యూహం కేవలం పిఠాపురం వరకు మాత్రమే పరిమితం కాలేద‌ని టాక్ ?  రాష్ట్ర వ్యాప్తంగా .. మ‌రీ ముఖ్యంగా ఉభ‌య గోదావ‌రి , ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కాపు సామాజిక వర్గం గణనీయంగా ఉన్న నియోజకవర్గాలన్నింటినీ టార్గెట్ చేస్తూ, అక్కడ మౌలిక సదుపాయాల పెంపు, విద్యా సంస్థల స్థాపన, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన వంటి నిర్ణయాలు తీసుకుంటోంద‌ట‌. ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశ్యం కాపు ఓట్లు ఏ పరిస్థితిలోనూ వైసీపీకి వెళ్లకుండా చూడడమే. ఓటు బ్యాంకులను సమర్ధవంతంగా నిర్వహించడం ప్రతి పార్టీకి సాధారణ వ్యూహమే అయినప్పటికీ, జనసేన ఈసారి ప్రత్యేక దృష్టిని కాపు సామాజిక వర్గం మీద కేంద్రీకరించడం రాజకీయంగా గమనించాల్సిన విష‌యం.


గత ఎన్నికల్లో కూడా కాపు ఓటర్లలో గణనీయ మద్దతు జనసేనకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మద్దతును మరింతగా పెంచుకోవడమే లక్ష్యంగా పార్టీ స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తోంది. కాపులు ఇతర సామాజిక వర్గాల కంటే జనసేనకు మరింతగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ అంచనా వేస్తోంది. అందుకే ప్రారంభ దశలోనే కాపు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో బలమైన పట్టు సాధించాలనే నిర్ణయానికి పార్టీ వచ్చింది. జనసేన - టీడీపీ కూటమి బలపడాలంటే కాపు ఓటు బ్యాంకు కీలకం అని భావిస్తూ, ముందుగానే ఈ వర్గాన్ని పక్కాగా తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది.


ఇప్పటికే పార్టీకి వచ్చిన మద్దతు భవిష్యత్తులో మరింత పెరుగుతుందని జనసేన నమ్మకం. ఈ నేపథ్యంలో కాపు వర్గం ఉన్న ప్రాంతాలన్నింటిలోనూ పార్టీ చురుకైన రాజకీయ చర్యలు ప్రారంభించడం ఎన్నికల సమీకరణాల్లో కీలక పాత్ర పోషించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: