ప్రస్తుత కాలంలో కిడ్నీలలో రాళ్లు రావటం చాలా సాధారణం అయింది. అన్ని వయస్సుల వారికి ఈ వ్యాధి వస్తుంది. కిడ్నీలలో రాళ్ల సమస్యతో బాధ పడేవారికి చాలా సందర్భాలలో మందులతో ఈ వ్యాధిని నయం చేయవచ్చు. మందులు వాడినా ఫలితం లేకపోతే అలాంటి సందర్భాలలో మాత్రం ఆపరేషన్ చేసి వైద్యులు కిడ్నీలోని రాళ్లను తొలగిస్తారు. చిన్న పిల్లలలో మాత్రం కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. 
 
తెలంగాణకు చెందిన నాలుగు నెలల బాబుకు యూరిన్ సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. తల్లిదండ్రులు ఆ బాబుని పరీక్షల కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొనివెళ్లారు. నీలోఫర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు పరీక్షలు చేసిన తరువాత బాబు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఈ కేసును హైదరాబాద్ లోని ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. 
 
ప్రీతి యూరాలజీ వైద్యులు బాబుకు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. వైద్యులు విజయవంతంగా శిశువు కిడ్నీలోని రాళ్లను తొలగించారు. మొత్తం 6 రాళ్లను రెండు కిడ్నీల నుండి వైద్యులు తొలగించారు. ఈ శిశువుకు ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో కిడ్నీలో రాళ్ల సమస్యతో ఆపరేషన్ చేయించుకున్న మగశిశువుగా రికార్డులు నమోదయ్యాయి. మాంసాహారం అధికంగా తినేవారిలో, ఉప్పు ఎక్కువ మోతాదులో తినేవారిలో, పోషకాహార లోపం ఉన్నవారిలో కిడ్నీలో రాళ్లు వస్తాయి. 
 
సాధారణంగా ఇలాంటి అరుదైన సర్జరీలు అమెరికా, చైనాలోని కొన్ని సెంటర్లలో మాత్రమే జరుగుతాయని ప్రపంచంలోనే తొలిసారిగా నాలుగు నెలల శిశువు రెండు కిడ్నీలలోని రాళ్లను తొలగించామని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ వి చంద్రమోహన్ తెలిపారు. ఈ సర్జరీని ఎండోస్కోపిక్ సర్జరీ అని అంటారు. ఈ విధానంలో మూత్రనాళం నుండి కిడ్నీకి దగ్గరగా వెళ్లి రాళ్లను తొలగిస్తారు. శరీరాన్ని కత్తిరించకుండా, కుట్లు వేయకుండా మరియు రక్తస్రావం జరగకుండా శిశువుకు రాళ్లను తొలగించారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: