
భూముల సేకరణ కోసం అధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. రైతులను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇదే సమయంలో కొన్ని భూములపై కోర్టుల్లో పిటిషన్లు పడటంతో ప్రక్రియ కొంచెం ఇరుకులో పడింది. పరిశీలనలో భాగంగా ప్రభుత్వం ఆశ్చర్యకరమైన అంశాన్ని గుర్తించింది – పిటిషన్ వేసిన వారిలో కొందరు ఎప్పుడో మరణించినవారేనని తేలింది. దీంతో ఈ వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. బుధవారం విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు, భూ సేకరణ పురోగతిని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్‌ను అడిగారు. కలెక్టర్ కోర్టు కేసులు అడ్డంకిగా మారుతున్నాయని వివరించారు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఇదంతా వైసీపీ వేషం. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని కుట్ర చేస్తున్నారు" అని ఆరోపించారు. రైతుల పేరుతో పెట్టిన పిటిషన్ల వెనుక ఎవరు ఉన్నారో బయట పెట్టి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డేటా సెంటర్ కోసం అవసరమైన భూముల విషయంలో రైతులకు భారీ ఆఫర్ ప్రకటించారు సీఎం చంద్రబాబు. "కేంద్రం చేసిన చట్టం ప్రకారం ఇచ్చే పరిహారం కాకుండా.. మనం రెట్టింపు ఇస్తున్నాం. అయినా చాలదంటే ఎలా?" అని ప్రశ్నించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కొందరు రైతులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పగా.. రైతులను ఒప్పించి, భూములు సమకూర్చేందుకు పార్టీ నేతలే కూడా కృషి చేయాలని సీఎం సూచించారు. "గూగుల్ డేటా సెంటర్ ఏర్పడితే వేలాది ఉద్యోగాలు వస్తాయి. విశాఖ భవిష్యత్తు ప్రకాశిస్తుంది. అలాంటి ప్రాజెక్ట్‌ను ఆపాలని ప్రయత్నించడం రాష్ట్రానికి వ్యతిరేకం. ఎవరు అడ్డంకులు సృష్టించినా వదలబోం" అని సీఎం స్పష్టంగా తేల్చి చెప్పారు. మొత్తంగా, గూగుల్ డేటా సెంటర్‌పై ఏపీ సర్కారు దూకుడు మొదలైపోయింది. వైసీపీ అడ్డంకులపై సూటిగా ఫైర్ చేసిన చంద్రబాబు.. రైతులకు రెట్టింపు పరిహారం ప్రకటించడం ఈ ప్రాజెక్ట్ అమలుకు కొత్త బలాన్ని ఇస్తోంది.